అమరావతి: మత్స్యకారుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. పాకిస్థాన్ జైళ్లలో బందీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులను విడిపించాలని లేఖలో కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. పొట్టకూటి కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్ కు వెళ్లిన మత్స్యకారులు పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారని తెలిపారు. మొత్తం 22 మంది మత్స్యకారులు ఉన్నట్లు తెలిపిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు.