హైదరాబాద్: టెలికాం సెక్టార్‌లో ప్రైవేటు ఆపరేటర్ల పోటిని తట్టుకుని నిలబడేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా తెలంగాణ, ఏపీలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 6 నెలల వ్యాలిడిటీతో రూ.899 విలువగల ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. రోజుకు 1.5 GB ఇంటర్నెట్ డేటా చొప్పున మొత్తం 270 GB డేటా వినియోగదారులకు లభించనుంది. 1.5 GB డేటాతోపాటు ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు తప్ప మిగతా అన్ని సర్కిళ్లలోని నెంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 50 ఎస్సెమ్మెస్‌లు లభించనున్నాయి.
గతంలోనూ రోజుకు 1.5 GB డేటాతో రూ.999 టారిఫ్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. ఆ టారిఫ్ రీచార్జ్ వ్యాలిటినీ కేవలం 181 రోజులకే పరిమితం చేసింది. అయితే, ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలోని వినియోగదారులకు అందుబాటులో ఉండగా, తాజాగా సోమవారం ప్రకటించిన రూ.899 ప్లాన్ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లకే పరిమితం కానున్నట్టు బీఎస్ఎన్ఎల్ స్పష్టంచేసింది. అయితే, రూ.999 రీచార్జ్ ఓచర్‌పై మాత్రం ఢిల్లీ, ముంబై సర్కిళ్లకు కూడా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పించింది.