ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ ఎడ్యూకేషన్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60 శాతం ఉత్తిర్ణత సాధించగా.. ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో విజయనగరం, ప్రకాశం జిల్లాలు నిలిచాయి. కాగా ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై మార్చి 18తో ముగిసిన విషయం తెలిసిందే. కేవలం 24 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదలవ్వడం గమనార్హం. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు.
ఈ సందర్భంగా ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తొలిసారిగా గ్రేడింగ్ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచామన్నారు. కాగా మే 14న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఫలితాల కోసం ఈ లింక్ ను క్లిస్ చేయండి.. http://bieap.gov.in/