Rajahmundray Disha Police Station: దేశంలో తొలిసారిగా.. ‘దిశ’ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్

Disha Police Station | యువతులు, మహిళలు, చిన్నారుల అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

Last Updated : Feb 6, 2020, 08:33 AM IST
Rajahmundray Disha Police Station: దేశంలో తొలిసారిగా.. ‘దిశ’ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్

అమరావతి: తెలంగాణలో సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏకంగా దిశ చట్టాన్నే తీసుకొచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు అనుకూల ఓటు వేయడంతో గతంలోనే చట్టంగా మారింది. దిశ చట్టం ప్రకారం మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్ష విధించనున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి స్టేషన్ ఏర్పాటు కానుండటం గమనార్హం. 

ఫిబ్రవరి 7వ  తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం వైఎస్ జగన్ దిశ పోలీస్ స్టేషన్‌ను, ఒన్ స్టాప్ సెంటర్లను స్వయంగా ప్రారంభించబోతున్నారు. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 1097 పోలీస్ స్టేషన్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించవచ్చు. ఓవరాల్‌గా 13 జిల్లాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల్లో దిశ పోలీస్ స్టేషన్ ఉండనుంది. వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, పిల్లలకు చనుబాలిచ్చేందుకు గది, ఇతరత్రా సౌకర్యాలు ఉంటాయి. డీఎస్పీ స్థాయి ఉన్న ఇద్దరు అధికారులు, అయిదుగురు ఇన్ స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుల్స్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఒక సైబర్ నిపుణుడు ఈ స్టేషన్‌కు సేవలందిస్తారు. ఏపీలో ప్రతి ఏడాది సరాసరి 600 అత్యాచార కేసులు, 1000 పోక్సో కేసులు నమోదవుతున్నాయి.

Also read: ఏపీలో దిశ చట్టం.. పూర్తి వివరాలు

దిశా కంట్రోల్ రూమ్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. 144 మంది అధికారులు విధులు నిర్వహించనున్నారు. కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేయడం, దోషులను అనతికాలంలోనే శిక్షించడానికి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఇన్వెస్టిగేషన్ అధికారికి ఓ కేసు ఛేదించేందుకు వారం రోజుల గడువు ఇస్తారు. ఆయనకు ఫొరెన్సిక్, ఇతరత్రా సిబ్బంది కేసు దర్యాప్తు, విచారణలో సాయంగా ఉంటారని ఏపీ డీజీజీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఒక్కో ఇన్వెస్టిగేషన్ అధికారికి ఏడాదికి 12 కేసులు మాత్రమే అప్పగించి వారిపై ఒత్తిడి లేకుండా చూస్తామన్నారు. 118 మంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఇదివరకే ప్రకటన ఇచ్చినట్లు చెప్పారు. 

Also read: ఏపీ దిశా చట్టంపై ఢిల్లీ సీఎం ప్రశంసల జల్లు

పీఎస్‌తో  పాటు ‘దిశ’ యాప్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. అఘాయిత్యానికి గురయ్యే మహిళ బదిర (మూగవారు) అయితే తమ ఫోన్‌ను 10 సెకన్లపాటు ఊపితే ఫోన్ కెమెరా ఆన్ అయ్యి ఆడియో, వీడియో నేరుగా దిశ కంట్రోల్ రూముకు చేరుతుంది. దిశ చట్టం ప్రకారం నమోదైన కేసుల విచారణ 14 పనిదినాలలో పూర్తి కావాలి. జిల్లాకొకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 13 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అందుబాటులోకి ఉంచుతారు. ఏ అడ్డంకులు లేకుండా చట్టం అమలయ్యేలా చూసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారిణి కృతిక శుక్లా, ఐపీఎస్ ఎం దీపికను ప్రభుత్వం నియమించింది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News