నెల్లూరు: నెల్లూరులో గృహనిర్మాణం పథకం కింద నిర్మించి ఇచ్చిన ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మైండ్‌గేమ్ ఆడుతున్న వైఎస్సార్సీపీని జనం చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ అవగాహనలేని రాజకీయాలు చేస్తోందని మండిపడిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్.. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న నన్ను విమర్శించడం ఏంటని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా విమర్శనాస్త్రాలు:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగించుకుని మనకు రావాల్సి వున్న బకాయి డబ్బులు రూ. 5 వేల కోట్లు అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ బంగారు బాతు లాంటిదని, ఆదాయం అంతా అక్కడే ఉందని చెబుతూ 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్‌లోనే వదిలివచ్చామని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ని తానే హైటెక్ సిటీగా మలిచానని అభిప్రాయపడ్డారు. 2022 వరకల్లా మూడు అగ్రరాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని, 2029 నాటికి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పిన చంద్రబాబు.. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంటాం అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ మనకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలి : ఏపీ సీఎం చంద్రబాబు