ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ప్రభుత్వ విభాగాలు అన్నిపార్టీల పట్ల సమానమైన వైఖరి అవలంభించాలి కాని కేవలం టీడీపీ నేతలపైనే దాడులు చేయడం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదాయ పన్ను శాఖ అధికారులను నిలదీశారు. ఆదాయ పన్ను శాఖ విభాగం టీడీపి నేతలపై ఏకపక్షంగా సాగిస్తున్న దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతల నివాసాలు, కార్యాలయాలపై వరుసగా కొనసాగుతున్న దాడులను ఖండిస్తూ చంద్రబాబు బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపైనా చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నారని.. అందుకే తాను 'సేవ్ ఇండియా సేవ్ డెమొక్రసి' (భారత్‌ను కాపాడుకుందా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం) అనే ఉద్యమాన్ని ప్రారంభించానని చంద్రబాబు నాయుడు మీడియాకు తెలిపారు.