ఏపీ వాహనదారులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోలు, డీజిల్ ధర రూ.2 చొప్పున తగ్గుతుందని సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వం ఏటా రూ.1120 కోట్ల మేర ఆదాయం కోల్పోనుంది. కేంద్రం కూడా పెట్రో ధరలు తగ్గించాలని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాల ప్రజలకు భారంగా మారిందన్న చంద్రబాబు.. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పెట్రోల్ ధర పెరిగిందని కేంద్రం ప్రజలను మభ్యపెడుతోందని చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర దిగొచ్చినప్పుడు కూడా చమురు ధరల తగ్గించలేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. 2013-14లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105.52 డాలర్లుగా ఉండేదని, 2015-16లో క్రూడాయిల్ ధర 46 డాలర్లకు పడిపోయిందని ఆయన చెప్పారు. అప్పుడు కూడా దేశంలో ఇంధన ధరలు తగ్గలేదన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 72 డాలర్లుగా ఉందని ఆయన చెప్పారు. 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.49.60 రూపాయిలు ఉంటే.. ప్రస్తుతం 86.70గా ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసిస్తూ నేడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రదర్శనలు చేపట్టుతుంటే.. ఒక్క వైకాపా మాత్రం ఆ నిరసనల్లో పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వైకాపాకు బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Andhra Pradesh CM Chandrababu Naidu announces a reduction in petrol and diesel price by Rs 2 each, in the state. (File pic) pic.twitter.com/SDX2sA8eez
— ANI (@ANI) September 10, 2018