Janasena Tickets Issue: ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. తక్కువ స్థానాలకు పరిమితం కావడంతో ఇప్పటికే జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీనికితోడు ఆ పార్టీ అదినేత టికెట్ల కేటాయింపు వ్యవహారం మరిన్ని సమస్యల్ని సృష్టిస్తోంది.
ఏపీలో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ధులందర్నీ ప్రకటించింది. రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్దుల్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ పార్టీకు బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాలను పొత్తులో భాగంగా బీజేపీ లేదా టీడీపీకు వదులుకోవడంపై తీవ్ర అసంతృప్తి రేగుతోంది. విజయవాడ పశ్చిమం బీజేపీకు, రాజమండ్రి రూరల్ స్థానం టీడీపీకు వదలడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు తిరుపతి వంటి కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పట్టంకట్టారు. ఇలా టికెట్ల కేటాయింపులో పవన్ వైఖరితో అయోమయంలో ఉన్న కేడర్‌కు జనసేనాని మరో షాక్ ఇచ్చారు.
చిట్టచివరిగా మిగిలిన రెండు స్థానాలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు కూడా అభ్యర్దుల్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ ట్విస్ట్ మొత్తం పార్టీ నేతల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఈ రెండు స్థానాల్ని స్థానికంగా ఉన్న జనసైనికుల్ని కాదని టీడీపీ నుంచి నేతల్ని పార్టీలో చేర్చుకుని కట్టబెట్టడం ఆశ్చర్యంగా ఉంది.
అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో చాలామంది ఆశావహులున్నారని, అందర్నీ పరిశీలించి అభ్యర్ధిని ఎంపిక చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుుడు స్తానిక నేతలకు హ్యాండిచ్చారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఖాయం చేశారు. విచిత్రమేంటంటే ఆయన ఇవాళే జనసేనలో చేరారు. అటు పాలకొండలో కూడా ఇదే పరిస్థితి. స్థానిక జనసేన నేతల్ని కాదని టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు టికెట్ ఖరారు చేశారు. ఈయన కూడా ఇవాళే జనసేనలో చేరారు. ఈ ఇద్దరికీ టికెట్ దాదాపుగా ఖరారైంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
స్థానికంగా ఉన్న నేతల్ని కాదని చివరి నిమిషంలో టీడీపీ నుంచి అభ్యర్ధుల్ని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 21 సీట్లకు పరిమితం కావడంపై చెలరేగిన అసంతృప్తి చల్లారుతుందనగా ఇప్పుడు తెలుగుదేశం నుంచి అభ్యర్ధుల్ని అరువు తెచ్చుకుని టికెట్లు కేటాయించడంపై జనసైనికుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
Also read: Volunteer Resignations: ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook