శ్రీలంక స్వాతంత్ర్యానికి 70 ఏళ్లు..!

శ్రీలంక దేశాధినేతలు, తమ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైన తరుణంలో భారీ వేడుకలు నిర్వహించారు.

Last Updated : Feb 5, 2018, 01:14 PM IST
శ్రీలంక స్వాతంత్ర్యానికి 70 ఏళ్లు..!

శ్రీలంక దేశాధినేతలు, తమ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైన తరుణంలో భారీ వేడుకలు నిర్వహించారు. ఫిబ్రవరి 4, 1948 తేదిన శ్రీలంక బ్రిటీష్ హయం నుండి విముక్తిని పొందింది. తాజాగా జరిగిన వేడుకలలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రానిల్ విక్రమసింగే పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకల్లో పాల్గొనడానికి క్వీన్ ఎలిజబెత్ తరఫున ప్రిన్స్ ఎడ్వర్డ్ కూడా రావడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సంప్రదాయ కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల సందర్భంగా శ్రీలంక జైళ్ళలో మగ్గిపోతున్న 544 ఖైదీలను విడుదల చేశారు. ఒకసారి చరిత్ర పుటలను తిరగేస్తే, 1796 ప్రాంతంలో తొలిసారిగా ఫ్రాన్స్ దేశస్తులు శ్రీలంకలో పాగా వేయాలని భావించారు. అయితే తర్వాత నెమ్మదిగా బ్రిటీష్ పాలకులు అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు.

1803లో తొలిసారిగా శ్రీలంక పాలకుడు విక్రమ రాజసింహ బ్రిటీష్ సేనలను ఎదురొడ్డి పోరాడాడు. అయితే అదే పాలకుడు యుద్ధంలో ఓడాక, తలదాచుకోవడానికి భారత్‌కు రావడం గమనార్హం. రెండవ కండ్యన్ యుద్ధంలో బ్రిటీష్ వారు విక్రమరాజసింహను ఓడించారు. 1833లో శ్రీలంకలో కోల్ బ్రూక్, కెమెరాన్ సంస్కరణలను తీసుకొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం.

1848లో ధరలు విపరీతంగా పెరగడంతో పాటు పన్నులు కూడా పెరగడంతో శ్రీలంకలో తిరుబాటుదారులు బయలుదేరారు. 1919లో తొలిసారిగా సింహళ పాలకులు, తమిళ రాజకీయ నాయకులు కలిసి సిలోన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు. పొన్నాంబళం అరుణాచలం నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది. 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చాక, డీఎస్ సేనానాయకే ఆ దేశానికి తొలి ప్రధాని అయ్యారు. పొన్నాంబళం అరుణాచలం ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 

Trending News