Ranil wickremesinghe as Srilanka New PM: శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే యూనైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడైన 73 ఏళ్ల రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు. అంతకు ముందు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో రణిల్ ఏకాంతంగా సమావేశమయ్యారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకోవడంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పదవికి మహిందా రాజపక్సే రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మహిందా సోదరుడు, దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే సైతం రాజీనామా చేయాలంటూ ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన గొటబయ తన అధికారాలకు కోత పెట్టుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తామన్నారు. ప్రజా ఆమోదం పొందిన నేతనే ప్రధానిగా ప్రకటిస్తాననీ.. క్యాబినెట్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ ఉండబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. తర్వాత రణిల్ విక్రమ సింఘేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రణిల్‌ను ప్రధానిగా ప్రకటించారు.
దేశంలోనే అత్యంత పురాతనమైన యూఎన్పీకి నాయకుడిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే.. నాలుగు సార్లు శ్రీలంక ప్రధాన మంత్రిగా పని చేశారు. 2018 అక్టోబర్ లో ఆయన్ను ప్రధాని పదవి నుంచి తప్పిస్తూ.. అప్పటి అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపింది. రెండు నెలల తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రణిల్‌ను మళ్లీ ప్రధానిగా నియమిస్తూ సిరిసేన అదేశాలు జారీ చేశారు.
శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. దేశంలో ఎప్పుడూ చూడని సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆహార కొరత, వనరుల కొరత వేధిస్తోంది. విదేశీ మారక ద్రవ్యాలు అడుగంటిపోయాయి. పీకలోతు అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దీనంతటికీ కారణం మహిందా రాజపక్సే అసమర్థ పాలన అంటూ నిరసనలు వ్యక్తమవయ్యాయి.
తొలుత శాంతియుతంగా నిరసనలకు దిగిన జనంపై అప్పటి ప్రధాని మహిందా రాజపక్సే అనుచర గణం దాడులకు దిగడంతో వారి రెచ్చిపోయారు. ప్రజాందోళనల కారణంగా తీవ్ర హింస చెలరేగింది. ఓ ఎంపీ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. మహిందా రాజపక్సే పూర్వీకుల ఇళ్లను సైతం జనం తగలబెట్టారు. ప్రాణభయంతో మహిందా రహస్య ప్రాంతానికి తరలిపోయారు. అయితే మహిందా, ఆయన కుమారుడు దేశం వదిలి వెళ్లకుండా స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకోబోనని గోటబయ రాజపక్సే స్పష్టం చేశారు. విపక్ష నేతగా ఉన్న రణిల్ ను ప్రధాని పదవిలో నియమించారు. రణిల్ నియామకానికి అధికార పార్టీ శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్పీపీ), ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్‌జేబీ, మరికొన్ని పార్టీలు మద్దతు పలికాయి.
మరోవైపు 2020 పార్లమెంట్ ఎన్నికల్లో యూఎన్‌పీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఆ పార్టీ కంచుకోట కొలంబో నుంచి పోటీ చేసి రణిల్ విక్రమ సింఘే సైతం ఓడిపోయారు.
Also Read: Yogi adityanath on National anthem: మదర్సాల్లో జాతీయగీతం తప్పని సరి.. యోగి సర్కార్ నిర్ణయం
Also Read: First Omicron Case in North Korea: ఉత్తరకొరియాలో తొలి ఒమిక్రాన్ కేసు.. దేశంలో లాక్డౌన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook