హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్టును దేశభక్తుడిగా కీర్తిస్తూ.. పాకిస్తాన్ ప్రభుత్వం స్టాంపులు విడుదల

కరడు గట్టిన ఉగ్రవాది మరియు హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్టు బుర్హన్ వానీని దేశభక్తుడిగా పేర్కొంటూ పాకిస్తాన్ ప్రభుత్వం స్టాంపులు విడుదల చేసింది. 

Last Updated : Sep 20, 2018, 09:29 PM IST
హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్టును దేశభక్తుడిగా కీర్తిస్తూ.. పాకిస్తాన్ ప్రభుత్వం స్టాంపులు విడుదల

కరడు గట్టిన ఉగ్రవాది మరియు హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్టు బుర్హన్ వానీని దేశభక్తుడిగా పేర్కొంటూ పాకిస్తాన్ ప్రభుత్వం స్టాంపులు విడుదల చేసింది. అవే స్టాంపులను ఆన్‌లైన్‌ వస్తువిక్రయ సంస్థ ఈబేలో అమ్మకానికీ పెట్టింది. భారతీయులు కూడా ఆ స్టాంపులు కొనుక్కోవచ్చని.. అయితే రూ.500 చెల్లించాలని.. పాకిస్తాన్ వారైతే రూ.8 పాకిస్తానీ రూపాయలు చెల్లిస్తే చాలని ఈబే ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో అంతర్జాలంలో బుర్హన్ వానీని దేశభక్తుడిగా పేర్కొంటూ పాకిస్తాన్ ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేస్తోంది.

కాశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ వేధింపులకు గురై మరణించిన వ్యక్తి బుర్హన్ వానీ అని.. జమ్ము కాశ్మీర్ ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లిములు ఎన్ని బాధలు పడుతున్నారన్న దానికి సాక్ష్యం బుర్హన్ వానీ అని పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది. జులై 8, 2016 తేదిన తొలిసారిగా ఈ స్టాంపులను కరాచీలో విడుదల చేసినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కామర్ జావేద్ బజ్వా మాట్లాడుతూ, బుర్హన్ మరణం కాశ్మీరీల్లో నూతన ధైర్యాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. 

2016లో కాశ్మీర్‌లో టెర్రిరిస్టులను తుదముట్టడించడంలో భాగంగా దక్షిణ అనంతనాగ్ ప్రాంతంలో బుర్హన్‌ని కూడా భారత సైనికదళాలు మట్టుబెట్టాయి. అప్పటికే బుర్హన్ పై వివిధ కేసులున్నాయి. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అమాయక యువకులను జిహాదీలుగా మార్చడం.. వారికి ఆయుధాలు సరఫరా చేయడం.. అలాగే వారిని పాకిస్తాన్ తరలించడం లాంటి విషయాల్లో బుర్హన్ వానీ ప్రధాన పాత్ర పోషించాడు. అనతి కాలంలోనే మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా వార్తల్లోకెక్కాడు. బుర్హన్ వానీని హతమార్చగానే.. పాకిస్తాన్ మీడియా భారత్ పై విరుచుకుపడింది. కాశ్మీర్‌లో అమాయక యువకులను ఇండియన్ ఆర్మీ పొట్టన పెట్టుకుంటుందని ఆరోపించింది. 

Trending News