ఇరాక్ దేశంలో తొలిసారిగా ఓ విదేశీయురాలికి మరణశిక్ష విధించింది కోర్టు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయన్న నెపంతో ఓ జర్మన్ మహిళకు ఈ శిక్షను విధించింది. గత సంవత్సరమే ఈ జర్మన్ మహిళలను ఇరాకీ దళాలు మాసుల్ ప్రాంతంలో యుద్ధఖైదీగా బంధించారు. అయితే శిక్ష విధించినప్పటికీ.. ఆమెకు అపీల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని బాగ్దాద్‌కు చెందిన సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ తెలిపింది. ఆ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జర్మనీ నుండి సిరియాకి ప్రయాణించిందని.. ఆ తర్వాత ఇరాక్‌లో పలు నిషేధిత దళాలతో కలిసి పనిచేసినట్లు తెలియజేయడంతో ఆమెకు శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. గతంలో కూడా ఓ రష్యన్ వ్యక్తికి ఇలాగే మరణశిక్ష విధించామని.. అయితే ఓ విదేశీ మహిళకి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారని కోర్టు తెలిపింది.