అమెరికాలో కాల్పుల సంస్కృతికి అంతం లేకుండా పోతోంది. తాజాగా గురువారం ఉదయం ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటిలో ఓ యవకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. ఫౌంటెన్ స్క్వేర్‌కి సమీపంలోని ఓ బ్యాంకులో చోరీకి పాల్పడేందుకు వచ్చిన దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట చెందిన పృథ్వీరాజ్ కండెపి (26) కూడా ఉన్నట్టు అక్కడి పోలీసులు గుర్తించారు. కాల్పుల్లో మృతిచెందిన పృధ్వీరాజ్ బ్యాంకులో ఓ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపారు. పృథ్వీరాజ్ మృతి వార్త తెలిసి తెనాలిలోని అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని తెనాలి తరలించేందుకు స్థానిక నేతల సహాయంతో అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులతో పృథ్వీరాజ్ బంధువులు సంప్రదింపులు జరుపుతున్నారు.
కాల్పులకు పాల్పడిన నిందితుడిని ఓహియోకే చెందిన ఒమర్ ఎన్రిక్ శాంతా పెరెజ్గా పోలీసులు గుర్తించారు.