FIFA Rejects Zelensky Plea: ఫిఫా వెంటపడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కి

FIFA Rejects Zelensky Plea: ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులను ఒప్పించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం ఫిఫా నిర్వాహకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన అనంతరం అనేక ప్రపంచ వేదికలపై ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు జెలెన్‌స్కి ప్రయత్నిస్తున్నారు.

Written by - Pavan | Last Updated : Dec 17, 2022, 09:16 PM IST
FIFA Rejects Zelensky Plea: ఫిఫా వెంటపడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కి

FIFA Rejects Zelensky Plea: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆ రెండు దేశాల్లో ఎంత అశాంతికి కారణమయ్యేలా చేసిందో చూశాం. ముఖ్యంగా రష్యా సేనలను తిప్పి కొట్టడంలో ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చినప్పటికీ.. ఉక్రెయిన్‌కి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం, ఆర్థికంగా నష్టం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టం ఉక్రెయిన్‌ని మళ్లీ కొన్ని దశాబ్ధాల వెనక్కు తీసుకెళ్లింది. ఇదే విషయమై ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేదికగా వివరించి యావత్ ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కి ప్రయత్నించారు. 

ఖతార్ స్టేడియంలో అర్జెంటినా, ఫ్రాన్స్ దేశాల మధ్య అంతిమ పోరులో యావత్ జాతిని ఉద్దేశించి శాంతి సందేశం ఇవ్వాలని భావించిన జెలెన్‌స్కి.. ఇదే విషయమై ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ ఆరంభానికి ముందుగా ఒక వీడియో లింక్ ద్వారా జాతికి సందేశం ఇవ్వాలనుకున్నారు. అయితే, జెలెన్‌స్కి విజ్ఞప్తిని ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులు సున్నితంగానే తిరస్కరించారు. ఫిఫా ప్రపంచ కప్ వేదికను రాజకీయాలకు వేదికగా చేయవద్దనే ఉద్దేశంతోనే ఫిఫా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

అయితే, ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులను ఒప్పించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం ఫిఫా నిర్వాహకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన అనంతరం అనేక ప్రపంచ వేదికలపై ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు జెలెన్‌స్కి ప్రయత్నిస్తున్నారు. అందు కోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 

20 దేశాల సదస్సు నుంచి గ్రామి అవార్డ్స్ ప్రదానం, కాన్స్ ఫిలిం ఫెస్టివల్.. ఇలా అనేక వేదికలపై తన శాంతి సందేశం వినిపిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా సీన్ పెన్, డేవిడ్ లిటర్మన్ వంటి ప్రపంచ స్థాయి జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఉక్రెయిన్ పరిస్థితిని ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని సైతం వేదిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు.

Trending News