కూలిన విమానం..11 మంది యువతులు దుర్మరణం

ఇరాన్ భూభాగంలో టర్కీకి చెందిన ప్రైవేట్ జెట్ విమానం కూలిపోయింది.

Last Updated : Mar 12, 2018, 05:21 PM IST
కూలిన విమానం..11 మంది యువతులు దుర్మరణం

ఇరాన్ భూభాగంలో టర్కీకి చెందిన ప్రైవేట్ జెట్ విమానం కూలిపోయింది. అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీకి చెందిన ఈ విమానం జగ్రోస్‌ పర్వత శ్రేణుల్లో కుప్పకూలింది.  ఈ ఘటనలో అదే విమానంలో ప్రయాణిస్తున్న 11 మంది యువతులు దుర్మరణం చెందారు.  ఆదివారం జెట్ విమానం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇంజన్‌లో లోపం కారణంగా పైలట్‌ విమానాన్ని కిందికి దించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మంటలు రేగి కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బషరన్‌ బిజినెస్‌ గ్రూప్‌ యజమాని కూతురు మినా బషరన్ ‌‌(28)తో పాటు ఆమె స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 370 కిలోమీటర్ల దూరంలోని షార్-ఇ-కోర్డ్ సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొని విమానం కూలిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ చానల్ తెలిపింది. కొండను ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగాయని, అందులో ఉన్న 11 మంది మహిళలు సజీవ దహనం అయ్యారని పేర్కొంది.

ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల్లోని ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారని, అయితే అప్పటికే అందరూ మృతి చెందారని ఎమర్జెన్సీ బృందం అధికారిక ప్రతినిధి మోజ్తాబా ఖలేది తెలిపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Trending News