అటు టీడీపీకి..ఇటు పార్టీ అధినేత చంద్రబాబుకు వీర విధేయుడిగా పేరున్న రేవంత్ రెడ్డి పక్కచూపులు ఎందుకు చూస్తున్నారు . రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మాతృ పార్టీ టీడీపీని కాదని ఆకస్మాతుగా కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారు అనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఆకస్మిక వైఖరికి పార్టీ అంతర్గత వ్యవహారాలే కారణమా.. ..లేక మరే ఇతర కారణాలున్నాయా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
మోత్కుపల్లి వైఖరితో విసుగు...
రేవంత్ రెడ్డి ఆకస్మిక వైఖరికి కారణం మోత్కుపల్లి నర్సింహులే కారణమని పార్టీ వర్గాల నుంచి సమాచారం. టీ సర్కార్ విధానాలపై పోరాడే సమయంలో రేవంత్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి అధిష్టానికి చాలా సార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పార్టీ కార్యక్రమాల్లోనూ.. ప్రజా వ్యతిరేకపోరాటాలు, పొత్తుల విషయం.. ఇలా అన్ని విషయాల్లోనూ పేచీ పెడుతుండటం రేవంత్ కు విసుగెత్తేలా అనిపించిందట..అలాగే మోత్కుపల్లి తనకు విరుద్ధమైన ప్రకటనలు ఇస్తూ తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. పార్టీ మారాలన్న ఆలోచన రావడానికి ఇదోక ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో ప్రభావం చూపని టీడీపీ..
రాష్ట్రంలోని తాజా పరిణామాలు కూడా ఆయన పార్టీ వీడడానికి మరో కారణమని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ ప్రభావం ఏమాత్రం లేదని గ్రహించిన రేవంత్ ..చాలా కాలం నుంచి తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచనలో పడ్డారని తెలిసింది. తను నిత్యం తిట్టే కేసీఆర్ పార్టీలో తనెలాగో చేరలేరు. సరే బీజేపీలో చేరుదామనుకుంటే అది ప్రస్తుతం టీడీపీకి మిత్రపక్షంగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రె్.. తెలంగాణలో కాస్తో కూస్తో ప్రభావం చూపగల్గిగే కాంగ్రెస్ లో చేరితే తన భవిష్యత్తుకు ధోకా ఉండబోదని రేవంత్ భావిస్తున్నారు. తన పొలిటికల్ కెరీర్ దృష్టిలో ఉంచుకొని ఈ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.