కలిసే ముందుకు వెళ్తాం: రాహుల్ గాంధీ, కోదండరామ్ ఉమ్మడి ప్రకటన

తెలంగాణ ఎన్నికలలో తాము కలిసి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ప్రకటించారు. 

Last Updated : Nov 3, 2018, 10:24 AM IST
కలిసే ముందుకు వెళ్తాం: రాహుల్ గాంధీ, కోదండరామ్ ఉమ్మడి ప్రకటన

తెలంగాణ ఎన్ని్కలలో తాము కలిసి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ప్రకటించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో 40 నిమిషాలకు పైగా కాంగ్రెస్ అధ్యక్షుడితో, కోదండరామ్ భేటీ కొనసాగింది. ఈ భేటీలో వారు పలు అంశాలను చర్చించారు. అమరవీరులు కలగన్న తెలంగాణ తమ లక్ష్యమని, నిరంకుశ పాలనను అంతమొందించడమే తమ ధ్యేయమని కోదండరామ్ తెలపగా.. వారి లక్ష్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందివ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని రాహుల్ తెలిపారు.

రాహుల్, కోదండరామ్‌ల మధ్య భేటీ జరిగిన తర్వాత నిర్వహించిన సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు పలువురు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీతో పాటు కాంగ్రెస్ నేత కొప్పుల రాజు, తెలంగాణ జన సమితి సభ్యులు అంబటి శ్రీనివాస్‌, గోపాల్‌ శర్మ, బైరి రమేశ్‌ మొదలైనవారు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు యాష్కీ మాట్లాడుతూ, కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ కూటమిగా ఏర్పడడం శుభ పరిణామమని తెలిపారు. 

రాహుల్‌తో సమావేశం తర్వాత కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జన సమితికి బలం ఎక్కువగా ఉన్నచోట్ల 15 నుండి 17 సీట్లను అడుగుతున్నామని తెలిపారు. సీట్ల పంపకానికి సంబంధించి చర్చ శనివారం హైదరాబాద్ నగరంలో జరుగుతుందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును తాము మర్చిపోలేదని.. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణ కార్యాచరణ కోసమే ఆ పార్టీతో తాము కూటమిలో కలవడం జరిగిందని కోదండరామ్ అన్నారు. ఆ కార్యాచరణ కఠినంగా, సక్రమంగా అమలు అయ్యేవరకూ ఈ కూటమి అనేది ఉంటుందని కోదండరామ్ ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. 

Trending News