హైదరాబాద్: 2018 జులై నుండి అమలు చేయాల్సి ఉన్న పీఆర్సీని (PRC) తెలంగాణ సర్కార్ మరోసారి ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( TSUTF ).. టీచర్స్ పట్ల సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. పీఆర్సీ గడువు పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టిఎస్‌యుటిఎఫ్ ప్రకటించింది. జూన్ 2, 2018 నుండి మధ్యంతర భృతి ఇస్తామని, 2018 ఆగస్టు 15న పిఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి ఏడాదిన్నర దాటినప్పటికీ.. సీఎం కేసీఆర్ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని టిఎస్‌యుటిఎఫ్ ప్రతినిధులు వాపోయారు. నేడు, రేపు అంటూ ప్రకటనలు చేస్తూ అమలును పట్టించుకోని ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
ఇకనైనా సర్కార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తక్షణమే 45% ఫిట్మెంట్‌తో పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని టిఎస్‌యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఇప్పటికైనా అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం నుండి అందాల్సి ఉన్న పిఆర్సీతో పాటు ముఖ్యమంత్రి ఇచ్చిన ఇతర హామీలను అమలు జరిపించుకోవాల్సిన అవసరం ఉందని టిఎస్‌యుటిఎఫ్ పిలుపునిచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..