హైదరాబాద్: తెలంగాణ బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిన సంగతి తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు, అత్యధిక సంఖ్యలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు 19వ తారీఖు నాటి తెలంగాణ బంద్‌కి మద్దతు పలికిన నేపథ్యంలో సమ్మె మలిదశ కార్యాచరణ మరింత పటిష్టంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే తర్వాతి విచారణ వరకు ఉధృతంగా నిరసనలు కొనసాగించాలని ఆదివారం రాజకీయ అఖిలపక్ష నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. అందుకు తమ వైపు నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని రాజకీయ పార్టీలు సైతం టిఎస్ఆర్టీసీ జేఏసికి మరోసారి భరోసా ఇచ్చాయి.
సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరి పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పార్టీలతో కలిసి జనసమీకరణ జరపాలని.. ఇందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరం అని ఆర్టీసీ జేఏసి నేత అశ్వత్థామ రెడ్డి పార్టీల నేతలకు విజ్ఞప్తిచేశారు.