రోడ్డు ప్రమాదంలో నిన్న ఉదయం మృతిచెందిన ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి ఆయన కుటుంబసభ్యులు ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని అంతిమయాత్రగా తీసుకెళ్లనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. మెహిదీపట్నం నుంచి సరోజినీదేవి కంటి ఆస్పత్రి, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర చేరుకోనుంది.
నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర నేపథ్యంలో ప్రముఖుల రాక, భద్రతా చర్యల కారణంగా ఆ మార్గంలో రద్దీ భారీగా ఉండనున్నందున ఆ సమయంలో పాఠశాలలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.