సొంతగూటికి కొండా దంపతులు ; కాంగ్రెస్ వర్గాల్లో ఫుల్ జోష్

                      

Last Updated : Sep 26, 2018, 06:53 PM IST
సొంతగూటికి కొండా దంపతులు ; కాంగ్రెస్ వర్గాల్లో ఫుల్ జోష్

హైదరాబాద్: ఎట్టకేలకు కొండా దంపతులు కారు దిగి చేయి అందుకున్నారు. అదేనండి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా మురళి,  సురేఖ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్న కొండ దంపతులు.. కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు ఫలించాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఈ రోజు ఉదయం పార్టీ అధ్యక్షుడి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌  పార్టీలో చేరారు. కొండాదంపతులు పార్టీలో చేరిక సమయంలో టి.పీసీసీ చీఫ్  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తో పాటు సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, రేణుకాచౌదరి తదితరులు ఉన్నారు.

కొండా కుటుంబానికి రాహుల్ హామీ
టీకెట్ల కేటాయింపులో తగిని ప్రాధాన్యమిస్తామని పార్టీలో చేరిక సమయంలో కొండా దంపతులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల కొండ కుంటుంబం ..మొత్తం మూడు స్థానాలను  డిమాండ్ చేస్తోంది. మహాకూటమి సర్దుబాటు దృష్ట్యా అన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడినట్లు సమాచారం. కొండా సురేఖ కోరుకున్న చోట ఒక సీటు ఖాయమని.. మరోక సీటు  పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత మరో సీటు కేటాయిస్తామని చెప్పినట్లు వార్త హల్ చల్ చేస్తోంది. కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

టీఆర్ఎస్ కు టాటా చెప్పడానికి కారణం ఇదే..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ వరంగల్ జిల్లాలో బలమైన మహిళా నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు  నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. తదనంతర పరిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ లో చేరారు. కొంత కాలం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కొండ దంపతులకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించలేదు. కొండా సురేఖ మహిళ కోటాలో మంత్రి పదవి ఆశించి  భంగపడ్డారు. ఇలా పార్టీ తీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదే రోజు పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఆ జాబితాలో  సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ పేరు లేదు. దీంతో  పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా దంపతలు.. కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతరం ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

Trending News