ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గత మూడురోజులుగా అక్కడే మకాం వేయడంపై పార్టీ వర్గాల్లో రకరకాల ఆసక్తికరమైన చర్చలు వినిపిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరిగా వరుసగా పార్టీ పెద్దలను కలుస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో పార్టీ పరమైన అంశాలను చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని పటిష్టపర్చడం, నాయకుల తీరుతెన్నులు, పార్టిపరమైన సవాళ్లు వంటి అంశాలపై కీలక నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపై టీపీసీసీలో ఉత్కంఠ మొదలైంది. మూడు రోజులుగా అక్కడే ఉండి మరీ నేతలను కలిసేంత ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి ? అసలు ఏం జరుగుతోంది అని టీపీసీసీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
శుక్రవారం రాత్రి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాలపై అరగంటపాటు చర్చించారు. బూత్ కమిటీలను ఏర్పాటు, ‘శక్తి’ ఆప్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఆదేశించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా పార్టీ సీనియర్ నేతలకు పలు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో టీపీసీసీ నేతల్లో ఎవరికి ఏం పదవులు దక్కుతాయా అనే ఉత్కంఠ మొదలైనట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.