తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి బుధవారం (అక్టోబర్ 10. 2018) రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాగా మొత్తం 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 5,69,447మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత వీరందరికీ సెప్టెంబరు 28న రాతపరీక్ష నిర్వహించాలనుకున్నారు. అయితే దరఖాస్తు ప్రక్రియలో తలెత్తిన సమస్యల కారణంగా పరీక్ష తేదీని సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 4కు మార్చారు. అయితే అక్టోబరు 4న ఇతర పరీక్షలు ఉండటంతో.. ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మళ్లీ అక్టోబరు 10కి వాయిదా వేశారు.
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు పేపర్-1, 100 మార్కులకు పేపర్-2 ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.
- పేపర్-1లో జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
- పేపరు-2లో తెలంగాణ పంచాయితీ రాజ్ నూతన చట్టానికి, పంచాయితీ రాజ్ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. (నోటిఫికేషన్ ప్రకారం..)
ఇవీ నిబంధనలు..
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును (పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి) తప్పకుండా తీసుకురావాలి.
- ఒక్క నిమిషం నిబంధన వర్తిస్తుంది.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి.
- బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను పరీక్షా హాలులోకి అనుమతిస్తారు.
- అభ్యర్థులు వెంట ఫోటోగ్రాఫ్స్ తీసుకురావాలి.