తెలంగాణ: పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నేడే

తెలంగాణ: పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నేడే

Last Updated : Oct 10, 2018, 01:28 PM IST
తెలంగాణ: పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నేడే

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు బుధవారం(అక్టోబర్ 10. 2018) రాతపరీక్ష జరుగనున్నది. తెలంగాణ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ.. పోలీస్, జేఎన్టీయూ, ట్రెజరీ, విద్యుత్‌శాఖల సహకారంతో రాతపరీక్షకు సర్వం సిద్ధంచేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుంది. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రశ్నా పత్రాల్లో జంబ్లింగ్ కోడ్ పద్ధతిని పాటిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 1,288 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు పేపర్-1, 100 మార్కులకు పేపర్-2 ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.  ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.

 పేపర్-1లో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ స్టడీస్ & మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
  పేపరు-2లో తెలంగాణ పంచాయితీ రాజ్‌ నూతన చట్టానికి, పంచాయితీ రాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.  (నోటిఫికేషన్ ప్రకారం..)

ఇవీ నిబంధనలు..

  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును (పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి) తప్పకుండా తీసుకురావాలి.
  • ఒక్క నిమిషం నిబంధన వర్తిస్తుంది.
  • గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. అభ్యర్థుల తనిఖీ ఉంటుంది.
  • బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను పరీక్షా హాలులోకి అనుమతిస్తారు.  
  • అభ్యర్థులు వెంట ఫోటోగ్రాఫ్స్ తీసుకురావాలి.
  • కాలిక్యులేటర్లు, అవి ఉండే గడియారాలు, సెల్‌ఫోన్లను అనుమతించరు.

Trending News