త్వరలోనే 18,000 పోలీసు ఉద్యోగాల భర్తీ

రాష్ట్ర పోలీస్‌శాఖలో త్వరలోనే 18,000 పోస్టులని భర్తీ చేయనున్నట్టు స్పష్టంచేసిన రాచకొండ పోలీస్ కమీషనర్ 

Last Updated : Mar 22, 2018, 11:50 PM IST
త్వరలోనే 18,000 పోలీసు ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలో త్వరలోనే 18,000 పోస్టులని భర్తీ చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలోని రాచకొండ గ్రామ పంచాయితీ ఐదుదొనలతండా నుండి కడీలబావితండా వరకు పోలీస్‌ కమ్యూనిటీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ అద్వర్యంలో రూ. 5 లక్షలతో 4 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపడుతున్న ఫార్మేషన్ రోడ్డుకు సీపీ మహేష్ భగవత్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమీషనరేట్‌కు రాచకొండ పేరు పెట్టడం కారణంగా రాచకొండ పేరున వున్న ఈ ప్రాంతానికి ఇంతకు ముందు వున్న ప్రాధాన్యత మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ ప్రాంతం చాలా వెనుకబడి వుండటంతో రాచకొండను దత్తత తీసుకొని దశల వారిగా ఇక్కడ మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

గతంలో రాచకొండ ప్రాంతంలో నిరుద్యోగులైన యువతకు కానిస్టేబుల్ కొలువుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్‌, టెలిఫోన్ టవర్ ఏర్పాటు, విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాం. ఇకపై కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొస్తాం అని ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 

Trending News