హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి సంస్మరణ సభ నేడు హైదరాబాద్‌లో జరిగింది. ఈ సంస్మరణ సభకు హాజరైన పలు పార్టీల నేతలు.. రాష్ట్రానికి, దేశానికి జైపాల్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రాజకీయాల వైపు ఆకర్షించే విధంగా జైపాల్ రెడ్డి గారు ప్రభావితం చేశారని అన్నారు. జైపాల్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు దేశంలోని లౌకిక పార్టీలను ఏకం చేసిన ఘనత ఆయనదని, 1978లో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సభ మొత్తం ఇందిరా కాంగ్రెస్ వైపే ఉందని గుర్తుచేశారు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇందిరా కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, జైపాల్ రెడ్డి గారు ప్రతి పక్ష పార్టీలో ఉండి కూడా ఆ రోజు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో నిబద్ధతతో ఉండి, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే.. ప్రజలనేకాదు, ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగలరని చెప్పడానికి జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఒక చక్కని ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు.
జైపాల్ రెడ్డి సేవలను కొనియాడిన పలువురు నేతలు.. వెనకబడిన పాలమూరు జిల్లా నుంచి రాజకీయ అరంగ్రేటం చేసి పలుమార్లు కేంద్రమంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు తెచ్చుకోవడం గర్వకారణమని, నేటి రాజకీయాలకు జైపాల్ రెడ్డి జీవితం ఆదర్శమని అన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి, దేశానికి జైపాల్ రెడ్డి చేసిన సేవలను సభకు హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కొనియాడారు. టీఆర్ఎస్ తరపున నాయిని నర్సింహా రెడ్డి ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు.