ఏప్రిల్ 27న 10th పరీక్ష ఫలితాలు

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి.

Last Updated : Apr 25, 2018, 06:02 PM IST
ఏప్రిల్ 27న 10th పరీక్ష ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని సచివాలయం డి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తార‌ని విద్యాశాఖ అధికారులు ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఫలితాలను మార్కులలో కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. www.bse.telangana.gov.in, cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలు చూడొచ్చు.

మార్చి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు  సుమారు 8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఫలితాల తేదీ ప్రకటించడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠత నెలకొని ఉంది.

ఈసారి తెలంగాణ విద్యాశాఖ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించింది. మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టాలనే ఉద్దేశంతో పరీక్ష రాసే సమయంలో విద్యార్ధి వాష్ రూంకి కూడా వెళ్లకూడదని నిబంధన పెట్టింది. అవసరమైతే అతని వెంట ఎస్కార్ట్ కూడా వెళ్ళేలా అన్ని పరీక్షా కేంద్రాలకు సూచించారట.

చీటింగ్ కేసు

ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో తెలంగాణ పోలీసులు నలుగురు గవర్నమెంట్ టీచర్లతో సహా మొత్తం 16 మంది టీచర్లపై కేసు రిజిస్టరు చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాలైన మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్సు పేపర్లను పరీక్షకు గంటకు ముందు వాట్సాప్‌లో లీక్ చేశారన్న ఆరోపణలతో వీరిపై కేసు నమోదు చేశారు.  

గతేడాది 2017లో మొత్తం 5,38,226 మంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను మేలో విడుదల చేశారు. గత సంవత్సరం కూడా తెలుగు పేపర్-I స్క్రీన్ షాట్‌లు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి వాట్సాప్‌లో రావడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

Trending News