హైదరాబాద్: కరోనావైరస్ అనుమానితుల సంఖ్య (Coronavirus cases in Hyderabad) పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కార్ (Telangana govt) పలు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు 108 ఆపరేషన్స్ ఇంచార్జి బ్రహ్మానంద రావు మీడియాకు తెలిపారు. కరోనావైరస్ సోకిందని భావిస్తున్న అనుమానితులను, కరోనా వైరస్‌కి సంబంధించిన లక్షణాలతో ( Coronavirus symptoms ) బాధపడుతున్న రోగులను ఆస్పత్రులకు తరలించేందుకు 108 వాహనాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. కరోనావైరస్ అనుమానితులను ఆస్పత్రులకు చేర్చే సమయంలో 108 సిబ్బంది ఆందోళనకు గురికాకుండా రోగితో పాటు వారి కోసం ప్రత్యేకమైన కిట్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. అందులో భాగంగా అనుమానితుడితో పాటు 108 సిబ్బంది కచ్చితంగా పర్సనల్ ప్రోటెక్షన్ కిట్స్ ధరించాల్సిందిగా సంబంధిత అధికారుల నుంచి వారికి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం, గాంధీ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రుల వద్ద అడ్వాన్స్డ్ 108 వాహనాలు సిద్ధం చేసినట్టు బ్రహ్మానంద రావు తెలిపారు. విమానాశ్రయంలో వివిధ దేశాల పౌరుల కదలికలు అధికంగా ఉంటుండటంతో విమానాశ్రయం పరిసరాల్లోనూ కరోనావైరస్‌ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.