హైదరాబాద్‌లో మహిళా టెక్కీ ఆత్మహత్య ! అసలేం జరిగింది ?

హైదరాబాద్‌లో మహిళా టెక్కీ ఆత్మహత్య ! అసలేం జరిగింది ?

Last Updated : Apr 6, 2019, 01:10 PM IST
హైదరాబాద్‌లో మహిళా టెక్కీ ఆత్మహత్య ! అసలేం జరిగింది ?

కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోన్న ఓ యువతి 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలంరేపింది. ఆత్మహత్యకు పాల్పడిన యువతిని నగరానికే చెందిన మేఘనగా పోలీసులు గుర్తించారు. మాదాపూర్‌లోని వెల్స్ ఫార్గో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వినయ్ కుమార్‌తో రెండేళ్ల క్రితమే మేఘనకు  వివాహమైంది. హైదర్‌నగర్‌లోని భవ్యాస్ అఖిల ఎక్సోటికా అపార్ట్‌మెంట్స్‌లో వినయ్ కుమార్, మేఘన జంట కాపురం ఉంటున్నారు. 

మేఘన తండ్రి పాండు రంగా చార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివాహం అయిన 6 నెలల తర్వాత నుండి వినయ్ కుమార్, అత్తమామలు నుండి మేఘనకు వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. వేధింపుల నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితమే మైత్రి నగర్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన మేఘనకు శుక్రవారం వినయ్ కుమార్ విడాకుల నోటీసులు పంపించాడు. 

ఊహించని పరిణామానికి ఖంగుతిన్న మేఘన తీవ్ర మనస్తాపానికి గురై తన భర్త, అత్తమామలు ఉంటున్న ఇంటికి వచ్చి వారితో గొడవ పడిందని, ఆ తర్వాత వెంటనే 9వ ఫ్లోర్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని మేఘన తండ్రి పాండు రంగా చార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు మృతికి ఆమె భర్త, అత్తమామల వేధింపులే కారణం అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేఘన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న సీఐ వీరేశం దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. పెళ్లయిన కొద్దిరోజులకే తమ కూతురు బతుకు అర్థాంతరంగా కడతేరిపోయిందే అని మేఘన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 

Trending News