KTR HYDRAA: హైడ్రా పేరుతో రేవంత్‌ రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: కేటీఆర్‌ సంచలనం

Musi Project Is Biggest Scam In India Says KT Rama Rao: దేశంలోని అతిపెద్ద కుంభకోణానికి రేవంత్‌ పాల్పడ్డాడని.. హైడ్రాతో విధ్వంసం సృష్టిస్తున్నాడని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 30, 2024, 05:47 PM IST
KTR HYDRAA: హైడ్రా పేరుతో రేవంత్‌ రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: కేటీఆర్‌ సంచలనం

KT Rama Rao Fire On HYDRAA: మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే రేవంత్‌ రెడ్డి అతి పెద్ద కుంభకోణానికి తెరలేపారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఇళ్లు కూలుస్తుంటే పేదలు తిట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. 'నమామీ గంగే ప్రాజెక్టే రూ.40 వేలు కోట్లు అయితే మూసీ ప్రాజెక్ట్ కోసం రూ.లక్షా 50 వేల కోట్లా?' అని ప్రశ్నించారు.

Also Read: Family Cards: రంగంలోకి 'ఒక రాష్ట్రం-ఒక కార్డు'.. ఐదు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన

హైదరాబాద్‌లో హైడ్రా తవ్వకాలు విస్తృత స్థాయిలో జరుగుతుండడంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యాలు ఏమిటి? ప్రజలకు ఇచ్చిన హామీలను కాదని మీ విలాసాలకు రూ.లక్షా 50 వేల కోట్లా?' అని ప్రశ్నించారు. 'ప్రజల సొమ్ము మీ అయ్యా జాగీరా? మూసీ బాధితుల పాలిట రేవంత్ రెడ్డి  కాలయముడిగా మారాడు' అని తెలిపారు. 'బాధితుల అక్రందనలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినబడటం లేదా?' అని నిలదీశారు.

Also Read: DSC Results 2024: దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త: రేవంత్‌ రెడ్డి

 

'రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టే తిట్లు గతంలో ఎప్పుడూ నేను వినలేదు. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీకోర్టును కూడా ఆశ్రయిస్తాం. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ చెప్పిందా? ఈ సోనియమ్మ చెప్పిందా? పేదల ఇల్లు కూల్చమని?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టుకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

'వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 300 రోజులు అయిన ఇప్పటిదాకా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలకు అక్కరకు రాని అంశంపైన రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టడం ఎవరికోసం? ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్. మీ ప్రాధాన్యతలు ఏంటో చెప్పండి' అని కేటీఆర్‌ కోరారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని తెలిపారు.

'అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటినా ఇప్పటికీ హామీల అమలుపై మాట్లాడడం లేదు. ఏ ప్రాధాన్యం లేకుండా రూ.లక్షా 50 వేల కోట్ల ఖర్చు చేస్తారా? ఏం ఆశించి మీరు ప్రాజెక్ట్ చేపట్టారు. ఖజనా ఖాళీ అయ్యింది. అప్పుల కోసమే అప్పులు అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. 420 హామీల్లో ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు' అని కేటీఆర్‌ విమర్శించారు. 'ఆక్రమణలకు సంబంధించి నేరం చేసిందెవరు? శిక్ష వేసేదెవరికి?' అని ప్రశ్నించారు.

'పేద, మధ్య తరగతి వాళ్లకు ఇళ్లు అనేది ఒక భావోద్వేగం. అలాంటి ఇళ్లును నిర్దాక్ష్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియదు. మాకు తెలుసు. ఇంటితో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ప్రజలు మీలాగ అయాచితంగా లక్కీ డ్రాలో వచ్చినట్లు ఎదగలేరు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చట్ట బద్దంగా అన్ని పర్మిషన్లు వాళ్లకు ఉన్నాయి. అయినా సరే వాళ్లు ఆక్రమణలకు పాల్పడినట్లు మీ కనుగోలు ఆధ్వర్యంలో 500 మందితో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు' అని కేటీఆర్‌ మండిపడ్డారు.

'మీకు దమ్ముంటే వాటికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్లు, వాటిని ప్రోత్సహించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలె' అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. లక్షలాది మంది జీవితాలను అంధకారం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా దేశంలో చేపట్టిన నది ప్రక్షాళన ఖర్చుల వివరాలను వివరించారు. కూల్చాల్సి  వస్తే ముందు హైడ్రా, జీహెచ్ఎంసీ బిల్డింగ్ లను కూలగొట్టాలే. అవి నాలాల మీద ఉన్నాయి. వాటిని కాకుండా పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లను పంపిస్తున్నారు' అని తెలిపారు.

'మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే రాహుల్, ప్రియాంక గాంధీ ఎక్కడున్నారు? మూసీ ప్రాజెక్ట్ కు లక్షా 50 వేల కోట్లంటే అది కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంక్‌లాంటిదే. పక్క రాష్ట్రంలో ఫించన్ పెంచగా.. రేవంత్ రెడ్డి ఎందుకు పెంచడం లేదు. ఇప్పటివరకు రైతుబంధు లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు' అని కేటీఆర్‌ విమర్శించారు.

'ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు కట్టిస్తామంటూ చెప్పారు. మీరు ఇళ్లు కూల్చేస్తామంటే కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా పడేది కాదు. రేవంత్ రెడ్డి మీడియాకు మొఖం చాటేసిండు. అధికారులను ముందు పెట్టారు. ప్రజలు తిడుతుంటే ఆయనకు మాట్లాడే పరిస్థితి లేదు. మంత్రులు కాకుండా అధికారులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. మీ మంత్రులు మూసీతో ఉండే ప్రయోజనాన్ని ఎందుకు చెప్పటం లేదు. వాస్తవాలను దాచి అధికారుల వెనుక దాక్కుంటే కుదరదు రేవంత్ రెడ్డి' అని కేటీఆర్‌ హెచ్చరించారు.

ఇళ్లు కూల్చుతుంటే చిన్న పిల్లలు రోడ్డెక్కి ఏడుస్తుంటే వాళ్లు పైసల కోసమే ఏడుస్తూ, తిడుతున్నారంటూ ఓ మంత్రి అంటాడు. మీ మంత్రులు ఒక్కో కుంభకోణాన్ని పంచుకున్నట్లు అనుకున్నారా? శ్రీధర్ బాబు ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడుతారు. మీరు ఇళ్లు కూల్చుతామంటే వాళ్లు ఏడవకుండా ఏమీ చేస్తారు. అలాంటి వాళ్లను అనటానికి శ్రీధర్ బాబుకు ఎలా మనసు వచ్చింది. సావాస దోషంతో శ్రీధర్ బాబు కూడా రేవంత్‌ రెడ్డి మాదిరిగా చెడిపోయిండు' అని వ్యంగ్యాస్త్రం సంధించారు.

'మీ ఊళ్లో మీ ఇల్లే ఎఫ్టీఎల్‌లో ఉంది. మీ అన్నాదమ్ముళ్ల ఇళ్లు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉంది. చిత్తశుద్ది ఉంటే ముందు నీ ఇల్లు, నీ అన్న ఇల్లు కూలగొట్టు. ముందు మీ మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లు కూలగొట్టు. ఆ తర్వాత పేదల మీదికి రా. మాదేమే వికాసం, మీదేమో విధ్వంసం. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డిస్ట్రక్షన్ పాలిటిక్స్' అని కేటీఆర్‌ తెలిపారు. 'డీపీఆర్ లేకుండానే ఎందుకు రెడ్ లైన్ వేస్తున్నావు. నువ్వు రెడ్ లైన్లు వేయటం కాదు. మీకు మేము డైడ్ లైన్ పెడుతున్నాం' అని పేర్కొన్నారు. రివర్ బెడ్, ఎఫ్‌టీఎల్‌లో ఉంటే ప్రభుత్వానికి మానవీయ కోణం ఉండాలి. మా అన్నకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అంటే ఊరుకునేది లేదని కేటీఆర్‌ హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News