సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఘాటైన హెచ్చరికలు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రం ఏర్పడిందని చెబుతూ 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం 12,751 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంస్కరణలు తీసుకొచ్చారని.. అందులో భాగంగానే కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకురావడం జరిగిందని గుర్తుచేసుకున్నారు. కొత్త సంస్కరణల తర్వాత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిపరుస్తుందోనని ప్రజలు సైతం ఆసక్తిగా చూస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, అదే సమయంలో కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు కఠినంగా ఉన్నాయని చెబుతూ... ఇకపై పని చేయకపోతే పదవులే పోతాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజా ఆశీర్వాదంతోనే పదవుల్లోకి వచ్చాం... ఆ ప్రజలే వద్దనుకున్నవారు తిరిగి ఇంటికి పోతామని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజాభివృద్ది చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పే క్రమంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్రం దేశంలో ఏది లేదు. మీ గ్రామానికి మీరే కథానాయకులు అయితే అభివృద్ధి సాధ్యం అవుతుంది. చెత్తను సంపూర్ణంగా నిర్మిలించేందుకు అందరూ సహకరించాలి. ప్రతీ ఒక్కరూ తమతమ ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. అందుకు స్థానిక నాయకులు సైతం చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. పెండింగ్ బిల్లులు ఉంటే ఇప్పించే బాధ్యత తనదని చెబుతూ.. 85 శాతం మొక్కలను బతికించే బాధ్యత మాత్రం మీపైనే ఉందని అన్నారు. లేదంటే పదవులు పోతాయని సున్నితంగానే హెచ్చరించారు. అంతేకాదు... ఒకవేళ పదవి నుంచి తొలగించాల్సి వస్తే... ముందుగా టీఆర్ఎస్ వారి నుంచే ఆ పని మొదలు పెడతామని చెప్పి పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఘాటైన హెచ్చరికలు చేశారు.
సీఎం సైతం కాపాడలేరు:
సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించని సర్పంచ్‌లను తొలగించాల్సి వస్తే.. ఆ తర్వాత వారిని సీఎం సైతం కాపాడలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. యువతను, కుల సంఘాలను అన్ని వర్గాల వారిని పల్లె ప్రగతిలో భాగస్వామ్యం చేయండి. మంత్రులు, ఎమ్మెల్యే జీతాలను ఆపేసి అయిన గ్రామపంచాయతీలకు సీఎం నిధులిస్తున్నారని.. గ్రామాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఇస్తోన్న ఆ నిధులతో గ్రామాలను అభివృద్ధిపథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని మంత్రి కేటీఆర్ ప్రజాప్రతినిధులను సూచించారు.
కాళేశ్వరం జలాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏ ఊరిలోనైనా గ్రామ సభ జరగడం లేదని మా దృష్టికి వస్తే.. అక్కడి ప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం. అందుకే మీ పదవిని మున్నాళ్ల ముచ్చట కానియ్యకండి అని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
వాళ్లే గ్రామ సర్పంచ్..
గ్రామాల్లో మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికైతే... వారి భర్తనో లేక మరొకరో సర్పంచ్‌గా చెలామణి అవుతుండటాన్ని పరోక్షంగా వేలెత్తి చూపించిన మంత్రి కేటీఆర్.. జనం ఓట్లు వేసి గెలిపించిన వారే పనిచేయాలని.. వారి కుటుంబ సభ్యులు కాదని హితవు పలికారు. తాను గ్రామాలను ఆకస్మిక తనిఖీలు చేస్తానని.. అలాగే మర్చి నెలలో సీఎం కేసీఆర్ సైతం ఆకస్మిక పర్యటనలు చేపడతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..