" రోడ్డు ప్రమాదానికి గురైన తాను అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్తుండగా, మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వస్తోందని పోలీసులు ట్రాఫిక్ నిలిపేశారని, ఫలితంగా తాను ప్రయాణిస్తోన్న అంబులెన్సు సైతం ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది " అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఇటీవల ఓ ఇంగ్లీష్ డైలీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. మంత్రి గారి కాన్వాయ్ కారణంగా ఓ రోగి ఇబ్బంది పడ్డారంటూ ఆ ఇంగ్లీష్ డైలీ ప్రచురించిన వార్తా కథనం సదరు మంత్రిగారి దృష్టికి వెళ్లింది. ట్విటర్లో ఆ వార్తా కథనాన్ని మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేసిన ఓ నెటిజెన్.. దీనిపై స్పందించాల్సిందిగా మంత్రిని కోరారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా వుంటూ సిటిజెన్స్, నెటిజెన్స్ ఎప్పటికప్పుడు అడిగే అనేక ప్రశ్నలకు అక్కడికక్కడే సమాధానాలు ఇచ్చే మంత్రి గారు ఈ ట్వీట్‌పై కూడా స్పందించారు. తన కారణంగా అలాంటి పొరపాటు జరిగిందని తాను భావించడం లేదన్న కేటీఆర్.. తాను అలా వ్యవహరించే రకం కాదని స్పష్టత ఇచ్చారు. అయితే, ఒకవేళ తన కారణంగా నిజంగానే రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ వ్యక్తి ఇబ్బంది పడి వుంటే మాత్రం, అతడికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి సందర్భాలు పునరావృతం కాకుండా పోలీసులని ఆదేశించాల్సిందిగా తెలంగాణ డీజీపీని కోరుతున్నాను అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
సదరు ఇంగ్లీష్ డైలీ ప్రచురించిన కథనం ప్రకారం.. నగర శివార్లలోని దమ్మాయిగూడ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందడం కోసం నగరంలోకి వస్తుండగా, అదే సమయంలో మంత్రి కేటీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ సైతం అటువైపుగా వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి గారి కాన్వాయ్ వెళ్లేవరకు యధావిధిగానే పోలీసులు తన ట్రాఫిక్ ని నిలిపేయగా... రోడ్డు ప్రమాదానికి గురైన తనను ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సైతం ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయిందని స్వయంగా బాధితుడే ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.