KCR SHOCK: జాతీయ రాజకీయాల్లో కొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు .. సొంత రాష్ట్రంలో షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో సీనియర్ నేత గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలోనూ రేవంత్ రెడ్డిని కలిసిన విజయారెడ్డి.. శనివారం ఉదయం పీసీసీ చీఫ్ తో మరోసారి సమావేశమయ్యారు. అంతేకాదు రేవంత్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దీంతో విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయిందని భావిస్తున్నారు. సీఎస్పీ మాజీ నేత, దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్థన్ రెడ్డి కూతురు విజయారెడ్డి. ఖైరతాబాద్ నుంచి రెండసారి కార్పొరేటర్ గా ఆమె పనిచేస్తున్నారు.
కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు విజయారెడ్డి. 2018లో ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కాని కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు టికెట్ ఇచ్చారు కేసీఆర్. అప్పటి నుంచి విజయారెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటును ఆశిస్తూ అధికార పార్టీలో కొనసాగారు. అయితే 2021లో జరిగిన గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్ గా గెలిచారు. మేయర్ సీటు తనకు వస్తుందని భావించారు. కాని టీఆర్ఎస్ పెద్దలు మాత్రం కేకే కూతురు విజయలక్ష్మిని మేయర్ చేశారు. ఆ సమయంలోనే తన అసమ్మతిని ఓపెన్ గానే వ్యక్తపరిచారు విజయారెడ్డి. విజయలక్ష్మి ఎన్నిక సమయంలో సమావేశం నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాకా కాంగ్రెస్ లో చేరాలని విజయారెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. గతంలోనూ ఓసారి రేవంత్ ను కలిశారు. కాని పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా రేవంత్ తో సమావేశం కావడంతో పాటు అతని పాటు ఏకంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన విజయారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసినా తనకు సరైన గుర్తింపు రాలేదన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ రాలేదన్నారు. ఎన్నికలకు టైం ఉంది కాబట్టి టికెట్ గురించి ఇప్పుడే మాట్లాడనని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook