హైదరాబాద్ : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం కింద దివ్యాంగులైన వధువులకు ఇకపై 25శాతం అదనపు లబ్ధి చేకూరనుంది. అవును, తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై పెళ్లి చేసుకోబోయే దివ్యాంగులైన వధువులకు కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1,25,145 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారమే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పెంచిన 25% ఆర్థిక సాయం కేవలం దివ్యాంగులైన లబ్ధిదారులకు మాత్రమే వర్తించనుందనేది గమనార్హం.
ప్రస్తుతం కల్యాణ లక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు చెందిన వధువులకు 1,00,116 రూపాయల ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కార్ అందిస్తోంది. అయితే, సుప్రీం కోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం వివిధ సంక్షేమ పథకాల కింద సాధారణ లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం కన్నా దివ్యాంగులకు 25% అదనంగా లబ్ధి చేకూర్చేలా సంక్షేమ పథకాలను సవరించాల్సిందిగా ఇటీవలే కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే తెలంగాణ సర్కార్ సైతం కల్యాణ లక్ష్మి పథకాన్ని సవరించి, దివ్యాంగులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పెంచినట్టు సమాచారం. ముస్లింలకు అందిస్తున్న షాదీ ముబారక్ పథకానికి సైతం ఇదే విధంగా లబ్ధి చేకూరేలా ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.