బీజేపీ నేత రాజా సింగ్ మరో మారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తుందని ఆయన తెలిపారు. అలాగే సికింద్రాబాద్, కరీంనగర్ పేర్లను కూడా మార్చివేస్తామని ఆయన పేర్కొన్నారు. "ఒకప్పుడు హైదరాబాద్ పేరు భాగ్యనగర్. క్రీ.శ 1590లో కులీ కుతుబ్ షా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భాగ్యనగర్ పేరును హైదరాబాదుగా మార్చేశారు. ఇదే ప్రాంతంలో ఆ తర్వాత అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. అందుకే మేం తిరిగి హైదరాబాద్ పేరును మార్చాలని భావిస్తున్నాం. భాగ్యనగర్ అనే కొత్త పేరును హైదరాబాద్ నగరానికి పెట్టాలని అనుకుంటున్నాం" అని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని రాజా సింగ్ తెలిపారు. ఏ పార్టీ కూడా తమను నిలువరించలేదని.. తెలంగాణాలో బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే కచ్చితంగా నగరం పేరు మారుస్తుందని రాజా సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇటీవలే యూపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఫైజాబాద్ పేరును అయోధ్యగా మారుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, ఇటీవలే గుజరాత్‌లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మారుస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో కూడా శివసేన ఔరంగాబాద్, ఉస్మానాబద్ పేర్లను శంభాజీ నగర్, దారాశివ్ పేర్లతో మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముస్లిం ఓట్ల కోసం ఈ డిమాండ్లను కాంగ్రెస్ పక్కన పెట్టిందని పలువురు శివసేన నేతలు తెలిపారు.