ఉపాధ్యాయ నియామక జీవో రద్దు.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్

ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన జీవోను రద్దు చేసి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. 

Last Updated : Nov 25, 2017, 06:18 PM IST
ఉపాధ్యాయ నియామక జీవో రద్దు.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన జీవోకు వ్యతిరేకంగా ధర్మాసనం తీర్పు వెలువరించింది. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాలు ఆధారంగా ఇచ్చిన నోఫికేషన్ ను రద్దు చేసి.. పాత 10 జిల్లాల ఆధారంగానే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదు..

కొత్త జిల్లాల వల్ల పాత జిల్లాలలో స్థానికేతరులుగా అభ్యర్థులు నష్టపోతున్నారని హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని... కొత్త జిల్లాలకు ఆమోదం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం శనివారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ..పాత 10 జిల్లాల  ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పాత 10 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి 31 జిల్లాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఇటీవలే దీని ఆధారంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. 

Trending News