తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికార పార్టీగా ఉండి కూడా... ఏపీ విషయంలో ఒకానొక సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. అయితే ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాత్రం.. ఆ అంశం గురించి ఏమీ పట్టించుకోనట్లే ప్రవర్తిస్తూ.. రిజర్వేషన్ల అంశం గురించి ఆందోళనలు చేయడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ముఖ్యంగా అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను సభాపతి చదువుతున్నప్పుడు.. టీఆర్‌ఎస్ సభ్యులు వేరే అంశాలపై ఆందోళన చేయడంతో ఆ పార్టీ విమర్శలను ఎదుర్కొంది. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని టీఆర్‌ఎస్ అడ్డుకుందా? అని ప్రశ్నిస్తూ.. జీన్యూస్ పెట్టిన పోల్‌కి పాఠకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. దాదాపు 51% పాఠకులు ఇందులో టీఆర్‌ఎస్ ప్రమేయం ఉందని భావిస్తుంటే.. 49% పాఠకులు మాత్రం టీఆర్‌ఎస్ తీర్మానాన్ని అడ్డుకోలేదని చెప్పడం గమనార్హం
ఈ రోజు ఇదే అంశంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని.. టీఆర్‌ఎస్ పెద్దమనసుతో సహకరించాలని కోరారు. అలా సహకరిస్తే.. విభజన చట్టంలోని భాగంగా తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంటు, గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లాంటి వాటి గురించి కూడా చర్చలో ఒక క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు.
విభజన చట్టంలో భాగంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత టీడీపీతో పాటు టీఆర్‌ఎస్‌కి కూడా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా ఇదే అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి అడ్డుతగల వద్దని టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు అందరూ మొక్కాలని ఆయన తెలిపారు