విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహంతో వరల్డ్ రికార్డులు ఒక్కొక్కటి ఆయన ఖాతాలోకి వచ్చి పడుతున్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆరు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆదివారం భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి, మూడవ టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ పూర్తిచేసి కోహ్లీ ఈ మైలురాయిని సాధించాడు.
శ్రీలంకతో ఆడిన గత టెస్టు మ్యాచ్లో కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేయగా.. తాజాగా మూడవ టెస్టులో కూడా డబుల్ సెంచరీ చేయడంతో.. వరుసగా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత దక్కించుకున్నాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ కెరీర్లో ఆరో డబుల్ సెంచరీని సాధించాడు కోహ్లీ. దీంతో మరో వరల్డ్ రికార్డు కోహ్లీ ఖాతాలో చేరింది.
ఈ ఘనత సాధించడంతో కోహ్లీ ఆరు డబుల్ సెంచరీలు సాధించిన భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు. అంతేకాదు కెప్టెన్ హోదాలో ఉంటూ ఆరు డబుల్ సెంచరీలు సాధించి.. బ్రియాన్ లారాను అధిగమించాడు. బ్రియాన్ లారా తన టెస్టు కెరీర్లో 5 డబుల్ సెంచరీలు చేసాడు.
ఒకే సిరీస్ లో 500 పరుగులకు పైగా స్కోర్ చేసి టీమిండియా బ్యాట్స్ మెన్ జాబితాలో గవాస్కర్ తరువాతి స్థానంలో కోహ్లీ నిలిచాడు. గవాస్కర్ ఒకే సిరీస్ లో 500కు పైగా పరుగులు ఆరుసార్లు సాధిస్తే, ఆ ఘనతను కోహ్లీ మూడుసార్లు సాధించాడు. జీఆర్ విశ్వనాథ్, రాహుల్ ద్రావిడ్ లు రెండుసార్లు ఈ ఘనత సాధించనవారి లిస్టులో ఉన్నారు.
మూడవ టెస్టులో భాగంగా రెండవ రోజైన ఆదివారం కోహ్లీ 238 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేసి.. హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. కొహ్లీకిది 63వ టెస్ట్ క్రికెట్. లంకేయులతో ఆదివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రెండవరోజు కోహ్లీ 238 బంతుల్లో 20 ఫోర్లు కొట్టి అజేయంగా నిలిచాడు.