రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పదవి నుంచి స్టీవ్ స్మిత్ ఔట్.. అజింక్య రహానే ఇన్ !

బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన కేసులో ఐసీసీ నుంచి శిక్ష ఎదుర్కుంటున్న ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టేన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

Last Updated : Mar 26, 2018, 04:24 PM IST
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పదవి నుంచి స్టీవ్ స్మిత్ ఔట్.. అజింక్య రహానే ఇన్ !

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన కేసులో ఐసీసీ నుంచి శిక్ష ఎదుర్కుంటున్న ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టేన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. స్టీవ్ స్మిత్ స్థానంలో అజింక్య రహానే కెప్టేన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. చాలా ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషిస్తోన్న అజింక్య రహానేకు జట్టుకు సంబంధించిన నైతిక విలువలు, పద్ధతులు అన్నీ తెలుసునని, అతడైతే కెప్టేన్ బాధ్యతకు న్యాయం చేస్తాడని తాము భావిస్తున్నామని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు క్రికెట్ మెళకువలు నేర్పిస్తున్న జుబిన్ భరుచ తెలిపారు. కొత్త కెప్టేన్సీపై ప్రకటన చేస్తూ తాజాగా మీడియాతో మాట్లాడిన భరుచ.. అజింక్య రహానే సామర్థ్యంపై తమకు పూర్తి స్థాయిలో నమ్మకం వుందని, అతడి కెప్టెన్సీపై ఎటువంటి సందేహం లేదని రహానే ప్రతిభపై విశ్వాసం వ్యక్తంచేశాడు.

క్రికెట్ క్రీడా స్పూర్తిని కాపాడేందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎప్పుడూ ముందే వుంటుందన్న భరుచ.. జట్టు కెప్టేన్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని స్టీవ్ స్మిత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని అన్నాడు. అంతేకాకుండా స్మిత్ స్థానంలో అజింక్య రహానే లాంటి ఆటగాడు ఆ స్థానాన్ని భర్తీ చేయనుండటం కూడా తాము అదృష్టంగానే భావిస్తున్నట్టు భరుచ అభిప్రాయపడ్డాడు. 

2008 ఐపీఎల్ సీజన్ మొదలుకుని 2015లో జట్టు సస్పెండ్ అయ్యేంతవరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకి జుబిన్ భరుచ హెడ్‌గా కొనసాగాడు. ఈ ఏడాదితో నిషేధం పూర్తి చేసుకుని 2018 ఐపీఎల్‌లో మళ్లీ స్థానం సంపాదించుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్రాంఛైజీ ప్రతినిధులు మరోసారి జట్టుకు పెద్దరికం నిర్వర్తించే బాధ్యతలను జుబిన్ భరోచ చేతిలోనే పెట్టిన సంగతి తెలిసిందే. 

Trending News