Unbreakable All Time Cricket Records: క్రికెట్లో కొంతమంది సీనియర్ క్రికెటర్స్ ని క్రికెట్ ప్రియులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. అందుకు కారణం ఆ క్రికెటర్స్ ఇంకెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సాధించిన అద్భుతమైన రికార్డులే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వాటినే ఆల్ టైమ్ రికార్డులు అని కూడా అంటుంటాం. ఎందుకంటే ఎవరో ఒక్కరి పేరు మీదే ఉంటేనే ఆ రికార్డు ఆల్ టైమ్ రికార్డు అవుతుంది.. ఆ అరుదైన ఘనత సాధించిన ఆటగాడిని అందరిలోకంటే మరింత ప్రత్యేకం చేస్తుంది. అలా ఇప్పటివరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డులు సొంతం చేసుకున్న ఆటగాళ్ల గురించి, వాళ్ల రికార్డుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
సచిన్ టెండుల్కర్ :
సచిన్ టెండుల్కర్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు ముద్దుగా " గాడ్ ఆఫ్ క్రికెట్ " అని పిలుచుకుంటుంటారు. తన 24 ఏళ్ల సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో సచిన్ పేరిట ఎన్నో రికార్డులు పుట్టుకొచ్చాయి. కానీ అందులో కొన్ని మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ అందుకోలేకపోయారు. అందులో ప్రప్రథమమైనది 100 ఇంటర్నేషనల్ సెంచరీలు. సెంచరీలు కొట్టడంలోనే సెంచరీలు కొట్టిన సత్తా కలిగిన ఏకైక ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
రోహిత్ శర్మ :
ఈ జాబితాలో వచ్చే రెండో క్రికెటర్ కూడా మళ్లీ మన టీమిండియా ఆటగాడే కావడం విశేషం. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఏకైక రికార్డు ఏంటంటే.. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా వన్డే క్రికెట్లో ఒక మ్యాచ్ లో అత్యధికంగా 264 పరుగులు రాబట్టిన ఏకైక ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అందుకే రోహిత్ శర్మకు ప్రపంచ క్రికెట్లో ఇంకెవ్వరికీ లేని " హిట్ మ్యాన్ " అనే పేరు వచ్చింది. 2014 నవంబర్ 13న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డు సాధించాడు.
ముత్తయ్య మురళీధరన్ :
ప్రపంచ క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరున్న ఏకైక బౌలర్ శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. అద్దం లాంటి పిచ్‌పైనైనా బంతిని గింగిరాలు తిప్పగలిగే సత్తా ఉన్న ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్‌కి మంచి ఇమేజ్ ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ మొత్తం 1300 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇది ఒక వరల్డ్ రికార్డు.
బ్రియన్ లారా :
క్రికెట్లో చరిత్ర సృష్టించిన అతికొద్దిమంది ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో బ్రియన్ లారా ఒకరు. వెస్టిండీస్‌కి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్.. టెస్ట్ క్రికెట్లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించాడు. 2004 లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రియన్ లారా ఏకంగా 400 పరుగులు చేసి యావత్ ప్రపంచమే నివ్వెరపోయేలా చేశాడు. ఈ రికార్డు సొంతం చేసుకునే క్రమంలో లారా ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్ పేరిట ఉన్న 381 పరుగుల అత్యధిక టెస్ట్ స్కోర్ రికార్డుని తుడిచేశాడు. కానీ బ్రియన్ లారా రికార్డును మాత్రం ఈ 20 ఏళ్లలో ఎవ్వరూ అందుకోలేకపోయారు.
ఏబీ డివిలియర్స్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. ఎందుకంటే స్టేడియం నలువైపులా ఎక్కడా గ్యాప్ లేకుండా షాట్లు కొట్టే ఆటగాడు మరి. ఈ సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం పేరిట ఉన్న రికార్డు ఏంటంటే.. వన్డే మ్యాచ్‌లో కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టిన తొలి ఆటగాడు. ఇప్పటివరకు ఆ రికార్డు ఎవ్వరూ అందుకోలేకపోయారు. 2015 లో జొహన్నెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్ జట్టుపై జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో డివిలియర్స్ 44 బంతుల్లో మొత్తం 149 పరుగులు రాబట్టాడు.