Dangerous Waterfalls In India:మనదేశంలో మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ ఏవో మీకు తెలుసా? జలపాతాల అందాన్ని ఆస్వాదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?
Dangerous Waterfalls: వర్షాకాలం రాకతో ప్రకృతి పచ్చగా కళకళలాడుతోంది. గలగల పారే సెలయేర్లు, కిలకిల రాగాల పక్షులు..జలజలవారే జలపాతాలతో అద్భుతంగా దర్శనిమిస్తోంది. ఈ వర్షాకాలంలో మీరు ప్రత్యేకంగా కొన్ని జలపాతాలను చూడాలనుకుంటే మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి జలపాతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అత్యంత ప్రమాదకరమైన జలపాతాలు కూడా మన ఇండియాలో ఉన్నాయని మీకు తెలుసా?చూడటానికి ఎంత అందంగా ఉంటాయో..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. మరి అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?
నోహ్కలికై జలపాతం, మేఘాలయ: నోహ్కలికై జలపాతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద జలపాతం.ఈ జలపాతం చూసేందుకు రెండు కళ్లు చాలవు. జలపాతం చుట్టూ ఉన్న దృశ్యం ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది. మేఘాలయలోని ఖాసీ కొండలలో చిరపుంజి సమీపంలో ఈ జలపాతం ఉంది. దాదాపు 340 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహించే ఈ జలపాతం అందాలను ముఖ్యంగా వర్షాకాలంలో తప్పక చూడాల్సిందే.
జోగ జలపాతం:కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని జోగా జలపాతం భారతదేశంలో రెండవ ఎత్తైన జలపాతం. కరుణాద్ ప్రాంత ప్రజలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 'జలపాతాల ప్రేమికులు'ఇక్కడికి తరలివస్తారు.వర్షాకాలంలో ఇక్కడి అందం మనస్సును హత్తుకుంటుంది. ఈ జలపాతం దాదాపు 253 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతుంది. దీనిని గెరుసొప్ప జలపాతం అని కూడా అంటారు.
దూద్‌సాగర్ జలపాతం, గోవా:భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో దూద్‌సాగర్ జలపాతం ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో దూద్‌సాగర్ అందాలను చూసేందుకు చాలా మంది ప్రజలు గోవాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.దీని ఎత్తు 310 మీటర్లు. వర్షాకాలంలో ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.కానీ వర్షాకాలంలో ట్రెక్కింగ్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కిన్రేమ్ ఫాల్స్, మేఘాలయ:మేఘాలయలోని మరో డేంజరస్ జలపాతం కిన్రెమ్ జలపాతం. భారతదేశంలోని ఏడవ ఎత్తైన జలపాతంగా గుర్తింపు పొందింది. వర్షాకాలంలో వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.ఇక్కడ అకస్మాత్తుగా నీరు పెరుగుతుంది. అందుకే జలపాతానికి దగ్గరికి పర్యాటకులను అనుమతించారు.
కుంటాల జలపాతం, తెలంగాణ: కుంటాల జలపాతం కూడా మోస్ట్ డేంజరస్ జలపాతంగా చెబుతుంటారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవాల్సిందే. సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.