Telangana Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఇదే, అలాచేస్తే మీ ఓటు చెల్లదు

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్, నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేటి (మార్చి 14న) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. భారీ సైజు బ్యాలెట్‌ పేపర్లు, జంబో బ్యాలెట్‌ బాక్స్‌లను ఉపయోగిస్తున్న ఈ పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు. 

1 /6

సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. దాంతో మనం ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పేరును సరిగ్గా వెతుక్కుని వారికి తొలి ప్రాధాన్యాత ఓటు వేయాలి. ఆ తరువాత రెండు, మూడు ఇలా 5 వరకు అభ్యర్థులకు ప్రాధాన్యాత ఓట్లు చేయవచ్చు. ఓటర్లు తప్పకుండా తమ తొలి ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మీ ఓటు చెల్లుబాటు కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్ సైతం పేర్కొన్నారు.

2 /6

పోలింగ్ కేంద్రంలో మీకు బ్యాలెట్ పేపర్‌తో పాటు ఇచ్చే ఊదా రంగు (వయోలెట్ కలర్) స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇతర పెన్నులు, స్కెచ్‌లు, పెన్సిల్ వాడి వేసే ఓటు చెల్లదని గుర్తుంచుకోండి.

3 /6

తొలి ప్రాధాన్యాత ఇవ్వాలనుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న ఖాళీ బాక్స్‌లో 1 అని రాయాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థులకు వారి పేర్ల ఎదురుగా బాక్సులలో 2 ,3, 4, 5 అని అంకె రాయాలి. అప్పుడు మాత్రమే అభ్యర్థుల ప్రాధాన్యత ఓట్లు సరిగ్గా లెక్కిస్తారు. ఒకవేళ తొలి ప్రాధాన్యత 1 ఇచ్చి ఇతర ప్రాధాన్యత ఇవ్వకుండా వేసిన ఓటు సైతం చెల్లుబాటు అవుతుంది.

4 /6

భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్‌ గుర్తించిన ఇతర భారతీయ భాషల్లో ఉపయోగించే అంకెలను వినియోగించవచ్చు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో భాగంగా అభ్యర్థులకు ప్రాధాన్యతగా 1, 2, 3... అంకెలను లేదా రోమన్ అంకెలు I, II, III, IV మరియు V లాంటివి మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

5 /6

తొలి ప్రాధాన్యత ఓటు 1ని ఒకరి కన్నా ఎక్కువ మందికి వినియోగిస్తే మీ ఓటు చెల్లుబాటు కాదు. అదే విధంగా ఇతర ప్రాధాన్యతలకు సైతం ఒకే అంకెను ఒక్క అభ్యర్థి కన్నా ఎక్కువ మందికి ఇవ్వరాదు. అలా రాసిన ఓట్లు చెల్లుబాటు కావు. మీ ఓటును లెక్కించరు.

6 /6

బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఏ విషయాలు, గీతలు, చుక్కలు రాయకూడదు, గీయరాదు. ఓటర్లు ఇంటి పేరు, సంతకం, ఇతర ఏ విషయాలు సైతం రాయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు. ఇందులో ఏది చేసినా ఓటు కౌంట్ చేయరు. అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న బాక్స్‌లో మాత్రమే ప్రాధాన్యాత సంఖ్య రాయాలి. ఏవైనా రెండు గడుల మధ్య ఉన్న గీతలపై ప్రాధాన్యత అంకెను రాస్తే మీ ఓటును లెక్కించరు. పోలింగ్ అధికారులు ఇచ్చే బ్యాలెట్ పేపర్‌ను మడత విప్పి ఓటు వేసిన తర్వాత మళ్లీ అదే తరహాలో మడత పెట్టి పోలింగ్ కేంద్రంలోని బాక్సులో వేయాలి.