Jammu and Kashmir: ఒక ఐడియా మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. అంతేకాదు ప్రపంచాన్నికూడా మార్చుతుంది. ఒకరిలో వచ్చే ఆలోచనలో ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. కాశ్మీర్ లో ఓ కొత్త ఐడియా..ఇప్పుడు నినాదంలా మారింది. ఓ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేసింది. ప్లాస్టిక్ ను బంగారంగా మార్చుతున్న ఆ గ్రామం ఎక్కడ ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం పూర్తిగా కలుషితం అవుతోంది. గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ భూతంలా పట్టి పీడిస్తోంది. జమ్మూకశ్మీర్ లోని ఓ కుగ్రామంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఓ సర్పంచ్ కు వినూత్న ఆలోచన వచ్చింది. 20క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చి ఇస్తే..ఒక గోల్డ్ కాయిన్ ఇస్తానంటూ ప్రకటించాడు.
దీంతో గ్రామంలోప్రజలంతా రహదారులు, డ్రెయినేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని అందించారు. ఫలితంగా 15రోజుల్లోనే గ్రామం రూపురేఖలు మొత్తం మారిపోయాయి. గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అందంగా మారింది. దీంతో అధికారులు ఆ గ్రామాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ 2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు.
'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి' పేరుతో ప్రచారం: జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా హిల్లర్ షాబాద్ బ్లాక్ లో సాదివార అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామ సర్పంచ్ ఫారూక్ అహ్మద్ ఉన్నారు. వ్రుత్తిరిత్యా అయన న్యాయవాది. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా అవుతుండటంతో ఎలాగైనా తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన వారికి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాను ప్రకటించాడు.
సర్పంచ్ ప్రకటనతో గ్రామస్తులు వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ ను సేకరించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ ను సైతం వెలికి తీశారు. ఫలితంగా 15 రోజుల్లో గ్రామం ప్లాస్టిక్ రహితంగా మారింది. అంతేకాదు గ్రామ సమీపంలో ఉన్న నదులు, వాగులు కూడా క్లీన్ గా మారాయి. సాధివార గ్రామం స్పూర్తితో పలు గ్రామాలు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేందుకు రెడీ అయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ కోసం భారత సమాఖ్య ప్రభుత్వ ప్రచార కార్యక్రమం ద్వారా తాను స్ఫూర్తి పొందానని ఫారూక్ అహ్మద్ ప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన చర్యలు చేపట్టింది. అయినప్పటికీ, భారత్ లో ప్లాస్టిక్ నిర్మూలన అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు.