NPS OPS and 8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు నేడు సమావేశం కానున్నారు. NPS, OPS, 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రధానితో చర్చలు జరిపే అవకాశం ఉంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయగా.. ఈ స్కీమ్‌ను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వాలని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కమిటీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఎన్‌పీఎస్ కింద పెన్షన్ గ్యారెంటీ, సంబంధిత ఆర్థిక చిక్కులను పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో ఉద్యోగ సంఘాల నాయకుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుందా..? అని ఎదురుచూస్తున్నారు.
త్వరలో హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీ గత పదేళ్లలో తొలిసారి జాతీయ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మండలి, జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) సభ్యులతో భేటీ అవుతున్నారు. ఓపీఎస్, ఎన్‌పీఎస్, కొత్త పే కమిషన్ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల బడ్జెట్‌లో కూడా ఎన్‌పీఎస్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. NPSకు ఉద్యోగుల సహకారం పెరగడంతో దాదాపు 40 శాతం పింఛను పెంపుదల ఉంటుందన్నారు.
పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని మళ్లీ పునరుద్దరించే అవకాశం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేయగా.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లోనే ఉద్యోగులకు ప్రయోజనాలను కలిగేలా మార్పులు చేయాలని భావిస్తోంది.
అందుకే ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఓపీఎస్, ఎన్‌పీఎస్ మధ్య వైరుధ్యాలను తొలగించే ఉద్యోగులను సంతృప్తిపరిచే దిశగా ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలిస్తోంది.
ఈ కమిటీ అంతర్జాతీయ పెన్షన్ సిస్టమ్స్, ఆంధ్రప్రదేశ్ NPS మోడల్‌ను పరిశీలించింది.
ఇక కొత్త పే కమిషన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తి కావడంతో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నేడు ప్రధాని మోదీతో భేటీతో తమ సమస్యలపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. సమావేశం అనంతరం వివరాలను ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించనున్నారు.