Ramojirao Death: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు అకాలమరణం తనను ఎంతగానో కలచి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చంద్రబాబు రామోజీరావుకు ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు.
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.... యావత్ దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరంఅన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు.
మీడియా రంగంలో రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక మేరు శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
రామోజీరావుతో తనకు 4 దశాబ్దాల అనుబంధం ఉందన్న చంద్రబాబు... మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... నన్ను ఆయనకు దగ్గర చేసిందన్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు గతంలో ఏపీకి రాజధాని పేరును ఏదైన ఉంటే సూచనలు చేయాల్సిందిగా రామోజీరావు గారిని కోరానని ఆయన దానికి అమరావతి పేరుపెడితే బాగుంటుందన్నారని గుర్తు చేసుకున్నారు.
అమరావతి అంటే ఇంద్రుడి రాజధాని. అమృతంలాంటి రాజధాని అని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆయనతో మాట్లాడుకున్న మాటల్ని చంద్రబాబు మరోసారి గుర్తుచేసుకున్నారు. రామోజీరావుగారు సూచించినట్లే అమరావతి రాజధాని పేరును ఖరారు చేసినట్లు చంద్రబాబు తెలిపారు.
సమస్యలపై పోరాటంలో ఆయన ఒక స్ఫూర్తి దాయకమని, ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని చంద్రబాబు అన్నారు. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా స్పందించారు. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా తన సంతాపం తెలిపారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. రామోజీ రావు అసలు పేరు.. చెరుకూరీ రామారావు. ఆయన.. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. క్రమక్రమంగా ఎదుగుతు ఈరోజు ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన అకాల మరణం పట్ల సినీ, రాజకీయ, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రామోజీ పిల్మ్ సిటీకి ఆయన చివరి చూపు కోసం వీఐపీలు, ఆయన అభిమానులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రేవంత్ సర్కారు రామోజీరావు అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించింది. ఒక మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే ప్రథమంగా తెలుస్తోంది.