Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Butta Bomma Movie Review: కప్పేలా అనే సూపర్ హిట్ మలయాళ సినిమాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేయగా బాలనటి అనిఖా సురేంద్రన్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయింది. సినిమా ఎలా ఉందో బుట్టబొమ్మ జీ తెలుగు న్యూస్ రివ్యూలో చూద్దాం పదండి!

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 4, 2023, 12:41 PM IST
Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Butta Bomma Movie Review: ఈ మధ్య కాలంలో ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే కోవలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అనేక సినిమాలను ఇప్పటికే తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు తాజాగా కప్పేలా అనే సూపర్ హిట్ మలయాళ సినిమాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేశారు. గతంలో అజిత్ నటించిన అనేక సినిమాల్లో బాలనటిగా నటించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. తమిళంలో అనేక హిట్స్ సినిమాలలో భాగమైన అర్జున్ దాస్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం మరో టాలెంటెడ్ నటుడు సూర్య వశిష్ట కూడా సినిమాలో భాగమవడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు భారీ సూపర్ హిట్ సినిమాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మించడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు అంతకంతకూ పెరిగాయి.  అలాంటి  ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

బుట్టబొమ్మ కథ : అరకులోని దూది కొండ అనే గ్రామానికి చెందిన సత్య(అనిఖా) చిన్నప్పటి నుంచి ఊరే లోకంగా పెరిగింది. ప్రపంచమంతా వాట్సాప్ ఇంటర్నెట్ అంటూ ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటే ఆమె మాత్రం తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వారికి సహాయపడుతూ తన సొంత డబ్బులతో ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటుంది. తన పక్కనే ఉండే లక్ష్మి(చందన) తన లవర్ తో మాట్లాడుకుంటూ ఉండటం చూసి తనకు కూడా ఎవరో ఒకరు లవర్ గా రాకపోతాడా? నేను కూడా ఆమెలాగా మాట్లాడకపోతానా అని అనుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలో రాంగ్ నెంబర్ ద్వారా మురళి(సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్ పరిచయం అవుతాడు. తన ఊరికే చెందిన చిన్ని అనే ఒక కోటీశ్వరుడు తాను వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నా తాను మాత్రం మురళి అనే ఆటో డ్రైవర్  ప్రేమలో పడుతుంది. పెళ్లి దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో ఏం చేయాలో తెలియక మురళిని కలవడానికి వైజాగ్ వెళుతుంది. వైజాగ్ వెళ్ళిన తర్వాత మురళి ఫోన్ వేరే ఎవరో కొట్టేస్తారు. ఆర్కే(అర్జున్ దాస్) అనే వ్యక్తి తనను తాను మురళిగా పరిచయం చేసుకుంటాడు, తర్వాత మురళి రావడంతో ఆర్కే తనకా ఫోన్ దొరికింది కాబట్టి ఇవ్వడానికే వచ్చానని తప్పించుకుంటాడు. అయితే తర్వాత కూడా ఆర్కే వీరి వెంట పడుతూ ఉండటంతో మురళి ఆర్కే మధ్య నుంచి జరుగుతుంది. చివరికి మురళి, సత్య వివాహం చేసుకుంటారా? ఆర్కే అసలు ఎందుకు మురళితో గొడవపడ్డాడు? చివరికి సత్య జీవితం ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 
సూపర్ హిట్ గా నిలిచిన కప్పేలా సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఇతర భాషలలో సూపర్ హిట్గా నిలిచిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్న సమయంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేస్తూ ఉండడంతో ఈ సినిమాలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో అని చూసిన అందరూ అనుకున్నారు కానీ పూర్తిగా సినిమాను నటీనటులను మార్చి కొన్ని చిన్న చిన్న మార్పులతో మరోసారి తెరకెక్కించినట్లుగా ఉంది. మలయాళ సినిమా అంతా క్రైస్తవం నేపథ్యంలో సాగితే మన తెలుగు సినిమా మాత్రం కాస్త హిందూ దేవీ దేవతల నేపథ్యంలో సాగుతుంది. పాత్రల పేర్లు మార్చారు కానీ దాదాపుగా మలయాళ సినిమాలో ఏదైతే కంటెంట్ ఉందో అదే కంటెంట్ ని మక్కీకి మక్కి తెరకెక్కించారు. ఎక్కడా కొత్తదనం కోసం ప్రయత్నించకుండా ఫ్లాట్ అదే ఉంచి చిన్న చిన్న మార్పులతో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రధాన అంశంగా తెరకెక్కిన కప్పేల సినిమాను ఏపీలోని విశాఖ- అరకు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. పెద్దగా కష్టం లేకుండా పూర్తిగా మలయాళం ఫార్ములానే ఫాలో అవుతూ సినిమాని ఆద్యంతం నడిపించారు. సత్య అనే యువతి కేవలం ఫోన్ పరిచయంతో మురళి అనే యువకుడిని ప్రేమించడం, ఏకంగా అతనిని కలిసేందుకు వెళ్లడం తర్వాత ఆర్కే అనే వ్యక్తి వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేయడం ఇలా దాదాపుగా మలయాళ సినిమాను యధాతథంగా దించే ప్రయత్నం చేశారు.

నటీనటుల పనితీరు 
ఇక నటీనటుల విషయానికి వస్తే సత్య పాత్రలో అనిఖా సురేంద్రన్ ఒదిగిపోయింది, పాత్రను పూర్తిగా అవగతం చేసుకోవడంతో హీరోయిన్గా తొలి ప్రయత్నంలోనే మెప్పించే ప్రయత్నం చేసింది. మురళి పాత్రలో సూర్య వశిష్ట ఆర్కే పాత్రలో అర్జున్ దాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అప్పటి వరకు మంచివాడిగా నటిస్తూ ఒక్కసారిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టే పాత్రలో సూర్య వశిష్ట ఒదిగిపోతే అప్పటి వరకు నెగిటివ్ అనిపిస్తూ ఒక్కసారిగా మంచి వాడిగా కనిపించే పాత్రలో అర్జున్ దాస్ కూడా జీవించాడు. ఇక సత్య తల్లీ-తండ్రి పాత్రలలో నటించిన నటీనటులు తమ పాత్రలకు కరెక్టుగా సూట్ అయ్యారు. అదేవిధంగా ఆర్కే ప్రేమికురాలుగా కనిపించిన నవ్య స్వామి పాత్ర చిన్నదే అయినా తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. 

టెక్నికల్ టీం 
టెక్నికల్ టీం విషయానికి వస్తే కొత్త దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ మొదటి సినిమాతోనే మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కువగా క్రియేటివిటీ చూపించకుండా పూర్తిగా మలయాళ సినిమాని తెలుగులో రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి దాదాపుగా సఫలమయ్యాడు. ఎక్కడా వంక పెట్టే అవకాశం లేకుండా సినిమా మొదటి నుంచి క్లైమాక్స్ వరకు పూర్తిగా మలయాళ సినిమా ఫార్ములా ఫాలో అయిపోయాడు. ఇక గణేష్ రావూరి డైలాగ్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ అంత క్యాచీగా లేదు కానీ సినిమాకి తగినట్లుగా సరిపోయింది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ అరకు అందాలను మరింత అందంగా చూపించింది. ఎడిటింగ్ కూడా సినిమాకి తగినట్లుగా సరిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బ్రాండ్ కి తగినట్టుగానే ఉంది.

ఫైనల్ గా 
ఒక్క మాటలో చెప్పాలంటే బుట్ట బొమ్మ కప్పేలా సినిమాకి మక్కికి మక్కి చేసిన రీమేక్. కప్పేల సినిమా చూసి కొత్తదనం ఆశించే వారికి కాస్త నిరాశే  అయినా ఒరిజినల్ చూడని వారు ఎంజాయ్ చేస్తారు. 
Also Read: 
Writer Padmabhushan Review : గుండెను మెలిపెట్టే మదర్ సెంటిమెంట్ తో సుహాస్ హిట్ కొట్టాడా?

Also Read: K Viswanath Passed Away: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. కళాతపస్వి అస్తమయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 
 
 

Trending News