దేశవ్యాప్తంగా త్వరలో షరియత్ కోర్టులు!

ఇస్లామిక్‌ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టులు(దారుల్ కాజా) ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు యోచిస్తోంది.

Last Updated : Jul 9, 2018, 09:56 AM IST
దేశవ్యాప్తంగా త్వరలో షరియత్ కోర్టులు!

ఇస్లామిక్‌ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టులు (దారుల్ కాజా) ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు యోచిస్తోంది. న్యూఢిల్లీలో ఈ నెల జరగనున్న బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనుంది. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో 40 షరియత్‌లు ఉన్నాయని, దేశంలోని అన్ని జిల్లాల్లో ఇటువంటి న్యాయస్థానాల ఏర్పాటుతో ముస్లింలు ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరముండదని బోర్డు సభ్యుడు జఫర్‌యాబ్‌ జిలానీ చెప్పారు.

షరియా చట్టం గురించి అవగాహన కల్పించేందుకు తఫీమ్‌-ఎ-షరియత్‌ కమిటీని పునఃప్రారంభించనున్నామని తెలిపారు. జడ్జీలు, లాయర్లు, సామాన్యులకు షరియత్‌ చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో ఈ కమిటీ ఇస్లామిక్‌ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తుందన్నారు. బోర్డు సమావేశంలో బాబ్రీ మసీదు కేసు గురించి చర్చిస్తామని.. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా బోర్డు స్వాగతిస్తుందన్నారు.

షరియత్ కోర్టుల ప్రతిపాదనను వ్యతిరేకించిన నేతలు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశంలోని అన్ని జిల్లాల్లో షరియత్ కోర్టులను స్థాపించాలనే ఆలోచనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ మీనాక్షి లెఖీ వ్యతిరేకించారు. ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఇటువంటి కోర్టులకు స్థానం లేదని, భారత్ 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' కాదని లెఖీ చెప్పారు. "మీరు మతపరమైన విషయాల గురించి చర్చించండి.. కానీ న్యాయస్థానం దేశానికి సంబంధించిన విషయం. జిల్లా, నగర, గ్రామ ఇలా ఏ స్థాయిలోనూ షరియత్ కోర్టులకు స్థానం లేదు. భారత్ 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా' కాదు" అని లెఖీ చెప్పారు.

కేంద్ర మంత్రి పిపి చౌదరి మాట్లాడుతూ, ఒకవేళ షరియత్ కోర్టులు ఏర్పడినట్లయితే, ఇటువంటి కోర్టు ఆమోదించిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటుంది కనుక ఇది అమలు చేయదగినది కాదన్నారు.

షరియత్ కోర్టుల ఏర్పాటు ఆలోచన.. భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ శుక్లా చెప్పారు  జనతా దళ్ (యునైటెడ్) జాతీయ కార్యదర్శి కెసి త్యాగి కూడా షరియత్ కోర్టులను స్థాపించాల్సిన అవసరం లేదన్నారు.  

 

Trending News