జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కొత్తగా నియమించబడిన భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి దినేశ్వర శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ యువకులు మిలిటెంట్లగా మారడానికి కారణం ర్యాడికల్ భావజాలమని, దానిని నియంత్రించడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటి పని అని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే కాశ్మీర్ సిరియాలా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
"నేను కాశ్మీర్ పౌరుల గురించి ఆందోళన చెందుతున్నాను. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే యెమన్, సిరియా, లిబ్యా దేశాల మాదిరిగానే కాశ్మీర్ పరిస్థితి కూడా మారుతుంది. ప్రజలు గ్రూపులుగా విడిపోతారు. కనుక కాశ్మీర్ సమస్యను పరిష్కరించే క్రమంలో మనమందరం ఒకే తాటిపై నిలబడాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
సామాన్య పౌరుల అభిప్రాయాలు తెలుసుకోవడం అన్నింటికన్నా ముఖ్యమైన విషయమని..అందుకే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వ్యక్తుల నుండి యువకుల వరకు అందరి వద్దకు వెళ్ళి మాట్లాడాలి. రాష్ట్రంలో హింసను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అభిప్రాయ సేకరణ చేయాలని దినేశ్వర శర్మ తెలియజేశారు. ముఖ్యంగా కాశ్మీరీ యువత విపరీత ఆలోచనా ధోరణికి దాసోహమై జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు.