అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దాదాపు 500 మహిళలకు పైగానే అరెస్టు చేసింది అమెరికా ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే.. ట్రంప్ ప్రతిపాదించిన ‘‘జీరో టాలరెన్స్ విధానం’’ పై విమర్శలు చేస్తూ అనేకమంది పౌరులు హార్ట్ సెనేట్ ఆఫీస్ భవనం ముందు గుమిగూడి ఆందోళనలు చేశారు. ఈ విధానం వల్ల కుటుంబాలు విడిపోతాయని.. చిన్నారులు ఇబ్బందిలో పడతారని.. శరణార్థులు దిక్కూ ముక్కూ లేనివారవుతారని తెలుపుతూ.. ఈ విధానానికి వెంటనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత పెద్ద ఎత్తున స్లోగన్స్ చేస్తూ .. నిరసనను చేపట్టారు. అయితే ఆందోళన హింసాత్మకంగా మారే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు హుటాహుటిన నిరసన కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం వద్దకు వచ్చారు. అక్కడ ఆశ్చర్యంగా వారికి పురుషుల కంటే మహిళలే ఎక్కువమంది కనిపించారు.
ఈ క్రమంలో దాదాపు 500 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు చేస్తున్న ఆందోళన పూర్తిగా చట్ట విరుద్ధమని.. ఇలాంటి ఆందోళనలను ఉపేక్షించవద్దని తమకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని.. అందుకే నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలపారు. అయితే జీరో టాలరెన్స్ విధానం అమానవీయమైన చర్య అని మహిళలు తెలిపారు. ఈ నెల 30వ తేదిన మరో ఆందోళన చేస్తామని.. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని వారు తెలిపారు.