ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్‌లోని రాహుల్ నివాసంలో కమల్ ఆయన్ని కలిశారు. దాదాపు అర్ధగంటపాటు వీళ్లిద్దరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడులోని పరిస్థితులు, అక్కడి రాజకీయాలు వీళ్లిద్దరి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ తాను మర్యాదపూర్వకంగానే రాహుల్ గాంధీని కలిశానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తమ మధ్య తమిళనాడు రాజకీయాల గురించి చర్చ జరిగినట్టు కమల్ మీడియాకు తెలిపారు. "నువ్వేంటో నీ స్థానం నిర్వచించదు కానీ నీ స్థానం ఏంటో నువ్వు నిర్వచించుకోవచ్చు" అని రాహుల్ గాంధీకి ఓ సందేశం రాసిన కమల్.. 'తానూ మీ(రాహుల్ గాంధీ) పెద్దలను స్పూర్తిగా తీసుకున్నవాడినే' అని అందులో పేర్కొన్నారు.
#Delhi: Makkal Needhi Maiam founder Kamal Hassan met Congress President Rahul Gandhi, says, "It was a formal courtesy meeting. We spoke about Tamil Nadu politics." pic.twitter.com/qRJP73FN33
— ANI (@ANI) June 20, 2018
గతేడాది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులలో కమల్ హాసన్ కూడా ఉన్నారు. అనంతరం ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సందర్భంలోనూ ఈ ఇద్దరూ కలిసి వేదిక పంచుకున్న సంగతి తెలిసిందే.